కెసీఆర్ ముందు చూపుతో వైద్య సదుపాయాలు పెంచారు
పొరుగు రాష్ట్రాల కేసులతోనే తెలంగాణకు తలకుమించిన భారం
తెలంగాణ చుట్టుపక్కల వున్న మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలనుంచి కరోనా పాజిటివ్ గా నమోదైన వారు తెలంగాణ కు వచ్చి ట్రీట్ మెంటు పొందుతున్నారని తెలగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వారి వారి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ గా లెక్కింప బడి రికార్డుల్లోకి ఎక్కిన వారు తెలంగాణ కు వచ్చి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలో కొవిడ్ పాజిటివ్ లెక్కల్లో తేడా వస్తున్నదని ఆయన తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిందన్నారు. తెలంగాణ కు జనాభా ప్రాతిపదిక కాకుండా, ఇతర రాష్ట్రాల పాజిటివ్ కేసులను కలుపుకుని, రాష్ట్రంలో ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసుల బెడ్ల సంఖ్య ఆధారంగా మందులు, ఆక్సీజన్ ఇతర కేటాయింపులు జరపాలని మంత్రి హరీష్ రావు కోరారు. తెలంగాణ లో మందుల కొరత పెరగడానికి ఈ లెక్కల్లో తేడా ప్రధాన కారణమన్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశాల మేరకు హరీష్ రావు బుధవారం నాడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మొదటి వేవ్ సందర్భంగా ఉన్న మౌలిక వసతులను రెండో వేవ్ వరకు రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిందని వివరించారు. నాడు కేవలం 18,232 బెడ్లు మాత్రమే ఉండగా నేడు వాటి సంఖ్య 53,775 కి అంటే మూడు రెట్లు పెరిగిందన్నారు. సిఎం కెసిఆర్ ముందు చూపుతో, 9213 గా వున్న ఆక్సీజన్ బెడ్ల ను 20738 కి,. ఐసియు బెడ్లను 3264 నుంచి 11274 కు ప్రభుత్వం పెంచిందన్నారు. గతంలో ఉన్నవాటికంటే మూడు రెట్లకు పెంచామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సీజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సీన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత మందులు సామాగ్రి కోటాను పెంచి సత్వర సరఫరా చేస్తామని రాష్ట్రానికి కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సిఎం కెసిఆర్ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ డోర్ టు డోర్ కొవిడ్ పీవర్ సర్వే ను నిర్వహిస్తున్నదని హరీష్ రావు వివరించారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్లు, ఎఎన్ఎం సిబ్బంది తో కూడిన 27,039 టీంలు ఇంటింటికి వెల్లి జ్వర పరీక్షలు నిర్వహిస్తున్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు.
అనుమానితులకు కరోనా నియంత్రిత మందులతో కూడిన హెల్త్ కిట్లను ఉచితంగా ప్రభుత్వం అందచేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కరోనా సోకిన విషయం పట్ల అవగాహన లేని వారిని గుర్తించి.. కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తుగానే అడ్డుకోవడం,తద్వారా దవాఖానాలో చేరే పరిస్థితినుంచి, మరణించే ప్రమాదాలనుంచి కాపాడినట్టవుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమం సత్పలితాలనిస్తున్నదన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 60 లక్షల ఇండ్లల్లో కోవిడ్ జ్వర పరీక్షలను నిర్వహించి అనుమానితులను ఐసోలేషన్ లో వుంచి వారికి హెల్త్ కిట్లు అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నేటినుంచి లాక్ డౌన్ అమలవుతున్నదని కేంద్రమంత్రికి తెలిపారు.