ఇండియా టుడే-యాక్సిస్ మై ది కూడా అదే మాట
అత్యంత ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయా అన్న టెన్షన్ రాజకీయాలపై ఆసక్తి ఉన్నప్రతి ఒక్కరిలో ఉంది. అసలు ఫలితాలు ఆదివారం వెల్లడి కానున్నాయి. అయితే ఇప్పటికే వెల్లడైన పలు కీలక సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ కు తెలంగాణ లో అధికారం ఖాయం అని స్పష్టం చేస్తున్నాయి. ఒకటి, రెండు సంస్థలు అధికార బిఆర్ఎస్ వైపు కూడా మొగ్గు చూపినా ...ఎక్కువ మంది మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి రావటం పక్కా అని చెపుతున్నారు. దీంతో ప్రస్తుతం అంతా గందరగోళంగా పరిస్థితి మారింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియా టుడే-యాక్సిస్ మై ఒక రోజు టైం తీసుకుని మరీ తెలంగాణ అసెంబ్లీ ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వివరాలు శుక్రవారం రాత్రి బహిర్గతం చేసింది.ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ను ఎక్కువ మంది గట్టిగా విశ్వశిస్తారు. అందుకే ఇవి ప్రత్యేకం అయ్యాయనే చెప్పొచ్చు కూడా. ఇండియా టుడే-యాక్సిస్ మై ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే అధికార బిఆర్ఎస్ 34 నుంచి 44 సీట్లకు పరిమితం కానుంది. కాంగ్రెస్ పార్టీ 63 నుంచి గరిష్టంగా 73 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది అని ఇండియా టుడే-యాక్సిస్ మై ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.
బీజేపీ నాలుగు నుంచి ఎనిమిది సీట్లకు పరిమితం అవుతుంది అని...ఇతరులకు ఐదు నుంచి ఎనిమిది సీట్లు వచ్చే అవకాశం ఉంది అని వెల్లడించారు. ఒక వైపు బిఆర్ఎస్ తమకు 70 సీట్లు వస్తాయని చెపుతుంటే...మరో వైపు కాంగ్రెస్ కూడా 75 నుంచి 80 సీట్లతో అధికారంలోకి రాబోతున్నట్లు చెపుతోంది. రెండు సార్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పై వివిధ వర్గాల్లో ఉన్న వ్యతిరేకత ఈ సారి కాంగ్రెస్ కు కలిసివస్తాయనే అంచనాలు గత ఆరు నెలల నుంచి ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత టికెట్స్ ఖరారులో కాంగ్రెస్ కాస్త వెనకబడినట్లు కనిపించినా తర్వాత అనూహ్యంగా పుంజుకుని దూసుకెళ్లింది. ఇప్పుడు ఆ ప్రభావం ఫలితాల్లో ఉండే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పక్కా వ్యూహం ప్రకారం ముందుకు సాగింది అనే చెప్పాలి. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా పలు జాగ్రత్తలు తీసుకుని వ్యవహరించింది. అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లు కూడా తెలంగాణాలో విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్ నాయకులు, శ్రేణుల్లో జోష్ నింపటం కూడా ఆ పార్టీకి పనికివచ్చింది అనే చెప్పాలి.