Telugu Gateway
Telangana

సబితా ఇంద్రా రెడ్డి బతిమాలుతారా..ఆదేశిస్తారా !

సబితా ఇంద్రా రెడ్డి బతిమాలుతారా..ఆదేశిస్తారా !
X

అది చైతన్య కాలేజీ అయినా...నారాయణ కాలేజీ అయినా విద్యార్థుల నుంచి లక్షలకు లక్షలు ఫీజు లు వసూలు చేస్తాయి. వీటిపై ప్రభుత్వ నియంత్రణ అంతంత మాత్రమే. ఈ కాలేజీల జోలికి ప్రభుత్వాలు కానీ..అధికారులు కానీ పెద్దగా రారు అనే చెప్పొచ్చు. ఎందుకంటే తెరవెనక జరగాల్సినవి అన్ని జరిగిపోతాయి కాబట్టి. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం చైత్యన కాలేజీ, అటు నారాయణ కాలేజీలు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటేనే ఉంటాయి. అంతే కాదు..వీళ్ళు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక కొంత మంది విద్యార్థులు ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కూడా నమోదు అవుతున్నాయి. ఎవరికైనా తక్కువ మార్కులు వస్తే అలాంటి వారిని అందరిముందు అవమానించేలా మాట్లాడం వంటి పనులు ఈ ప్రవేట్ కాలేజీ సిబ్బంది చేస్తూ ఉంటారు. మార్కులు ఎలా పెంచుకోవాలి..ఇంకా బాగా ఎలా చదవాలో తక్కువ మార్కులు వచ్చే వారికీ చెప్పాలి కానీ ...అందరి ముందు ఆయా కాలేజీ ల సిబ్బందే విద్యార్థుల ఆత్మ స్థైర్యం దెబ్బతినేలా చేసి వాళ్ళను మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజా గా నార్సింగ్ లోని చైతన్య కాలేజీ లో సాత్విక్ అనే విద్యార్ధి అక్కడి లెక్చరర్స్, ఇతర సిబ్బంది ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేసిన వ్యాఖలు కూడా చర్చనీయాంశగా మారాయి.

ప్రైవేట్ కాలేజీ లు ప్రభుత్వాల ఆదేశాలను గట్టిగా చెప్పిన రోజుల్లోనే ఏమి పట్టించుకోలేదు. అలాంటిది మంత్రి తాజా ఘటన పై స్పందిస్తూ ‘ విద్యార్థులను ఒత్తిడికి గురిచేయవద్దని కాలేజీ మేనేజ్ మెంట్ లకు విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులు ఒత్తిడికి గురి అవుతున్నారనే సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ కూడా తీసేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రతి కాలేజీ లో కౌన్సిలర్స్ ను పెట్టమని చెప్పాము’ అంటూ మీడియా సమావేశంలో వెల్లడించారు. చదువుల కోసం తల్లిదండ్రులు పిల్లలను మీ దగ్గర పిల్లలను వదిలిపెట్టినప్పడు మీ బాధ్యత కూడా ఉంటుంది అంటూ కాలేజీలను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. సాత్విక్ మరణం పై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు. ఎక్కడైనా..ఎవరైనా విద్యార్థులను ఒత్తిడికి గురిచేసినట్లు ప్రభుత్వం దృష్టికి వస్తే కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పాల్సిన మంత్రి...కాలేజీలకు విజ్ఞప్తి చేస్తున్నాం అని మాట్లాడంపై కొంత మంది అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలు అంటేనే చైతన్య, నారాయణ కాలేజీలు పలు విషయాల్లో ఉల్లంఘనలకు పాల్పడుతాయని...అలాంటిది విజ్ఞప్తి అంటే అవి అసలు పట్టించుకుంటాయా అని ఒక అధికారి అనుమానం వ్యక్తం చేశారు.

Next Story
Share it