Telugu Gateway
Telangana

షో అంతా కెసిఆర్..కెటిఆర్ లదేనా ?!

షో అంతా కెసిఆర్..కెటిఆర్ లదేనా ?!
X

పన్నెండు పేజీ ల యాడ్స్ లో ఓన్లీ కెసిఆర్ ఫ్యామిలీ వాళ్ళ ఫొటోలేనా!

మంత్రులంతా పేరుకేనా...షో అంతా వాళ్లదేనా

హాట్ టాపిక్ గా మారిన ప్రకటనల అంశం

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మంత్రులకు అసలు ఏ మాత్రం పాత్ర లేదా. అంతా ముఖ్యమంత్రి కెసిఆర్, అయన తనయుడు మంత్రి కెటిఆర్ లే చేశారా? ఇతర తెలంగాణ మంత్రులు అందరూ కేవలం నామ్ కె వాస్తే ...ఏదో ఉన్నారు అంటే ఉన్నారు అన్నట్లేనా?. స్వయంగా ప్రభుత్వమే ప్రజలకు ఈ రకమైన సంకేతాలు పంపితే వాళ్లకు ఏమి విలువ ఉంటుంది...వాళ్ళను ఎవరైనా పట్టించుకుంటరా అన్న చర్చ సాగుతోంది అధికార వర్గాల్లో. తెలంగాణలో అధికారం ఎంత కేంద్రీకృతంగా సాగుతుందో చెప్పే పరిణామం ఇది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిన జూన్ 2 నుంచి ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఈనాడు పత్రికలో పన్నెండు ఫుల్ పేజీ ల యాడ్స్ ఇచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది స్పెషల్ పుల్ అవుట్. ప్రగతి రతనాల వీణ...పదేండ్ల నా తెలంగాణ అన్న శీర్షికతో ఇది సాగింది. ఇక్కడ పాయింట్ ఏమిటీ అంటే ఈ పన్నెండు పేజీ ల యాడ్స్ లో సీఎం కెసిఆర్ ఫోటో టాప్ లో కామన్ గా పెట్టారు. అందులో తప్పు పట్టేది ఏమీ లేదు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే సంక్షేమ జయకేతనం యాడ్ లో మాజీ ఎంపీ , తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ దళిత బందు కార్యక్రమంలో పాల్గొన్న ఫోటో ఉంది కానీ...సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోటో లేదు.

చదువుల తల్లి నా తెలంగాణ పేజీ లో ఎక్కడా విద్య శాఖ మంత్రి సబితా ఇందిరా రెడ్డి ఫోటో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రెండు కోట్ల ఎకరాల మాగాణా పేజీ లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫోటో మచ్చుకు కనిపించదు. భువన భవన విజయంలో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి కి అదే పరిస్థితి. ఆరోగ్యం, ఆనందం పేజీ లో మాత్రం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఫోటో ఒక చోట మాత్రం పెట్టారు. పవర్ హౌస్ తెలంగాణ లో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కి అంతే. పల్లె పల్లెకు సింగారం లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కనపడరు.పరిశ్రమల ప్రాభవం లో మాత్రం పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఫోటో పెట్టారు. అంటే ఈ పన్నెండు పేజీ ల యాడ్స్ లో సీఎం కెసిఆర్ తో పాటు కెటిఆర్, హరీష్ రావు, వినోద్ కుమార్ ఫోటోలు ప్రత్యేకంగా పెట్టారు కానీ...ఇతర మంత్రులను మాత్రం అసలు పట్టించుకోలేదు. ఒక్క ఈనాడే కాదు వివిధ పత్రికల్లో కూడా తెలంగాణ సర్కారు పెద్ద ఎత్తున యాడ్స్ ఇచ్చి ప్రచారం హోరెత్తిస్తున్నారు. తెలంగాణ లో ఏమీ చేసిన తామే తప్ప ఇతర మంత్రులది ఏమీ లేదు అని ఈ ప్రకటనల ద్వారా చెప్పారు అని ఇవి చూసిన వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it