Telugu Gateway
Telangana

థ‌ర్డ్ వేవ్ రాకుండా చూడాల్సిన బాధ్య‌త అంద‌రిపై

థ‌ర్డ్ వేవ్ రాకుండా చూడాల్సిన బాధ్య‌త అంద‌రిపై
X

భ‌విష్య‌త్ లో రెండు డోసుల వ్యాక్సిన్ పూర్త‌యిన వారినే మాల్స్, హోట‌ల్స్ లోకి అనుమ‌తించే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ హెల్త్ డైరక్ట‌ర్ శ్రీనివాస‌రావు తెలిపారు.థ‌ర్డ్ వేవ్ రాకుండా చూడాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అయితే ప్ర‌స్తుతం తెలంగాణ‌లో క‌రోనా అదుపులోనే ఉంద‌ని..ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. డెల్టా వేరియెంట్ భార‌త్ తో పాటు 130దేశాల్లో చాలా ఇబ్బందులు పెట్టిందని, మన పక్క రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయన్నారు. కేరళలో దేశంలో నమోదు అయ్యే కేసుల్లో 50శాతం అక్కడే నమోదు అవుతున్నాయన్నారు. వాక్సినేషన్ ఎక్కువగా జరిగిన దేశాల్లో కూడా కేసులు నమోదు అవుతున్నాయని, కానీ మైల్డ్‌గా ఉంటున్నాయన్నారు. శ్రీనివాస‌రావు శ‌నివారం నాడు మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

డెల్టా, డెల్టా ప్లస్ రెండు దాదాపుగా ఒక్కటే లాగా ఉన్నాయన్నారు. ప్రమాదకరమైనవి ఏమి కాదన్నారు. భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే నిర్లక్ష్యం తగదన్నారు. ఇంకా మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయన్నారు. నిబంధనలు పాటించకపోతే ఔట్ బ్రేక్ అవుతున్నాయని చెప్పారు. ఖమ్మం కూసుమంచిలో కూడా ఇలాంటివే చూస్తున్నామని తెలిపారు. పాజిటివ్ అని తెలియక ప్రజల మధ్యలో తిరగటం వల్ల స్ప్రెడ్ ఎక్కువగా అవుతోందన్నారు. రాష్ట్రంలో స్వీయనియంత్రణ లేకపోతే కేరళ లాగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ‌లో ఇప్ప‌టివ‌ర‌కూ రెండు డెల్టా ప్ల‌స్ కేసులు వ‌చ్చాయ‌న్నారు. ఇద్ద‌రూ పూర్తిగా కోలుకున్నార‌ని..కాంటాక్ట్ ల‌ను ప‌రిశీలించినా నెగిటివ్ వ‌చ్చింద‌న్నారు.

Next Story
Share it