గుర్రపు బండిపై అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల విషయంలో అధికార టీఆర్ఎస్ తన వైఖరో ఏంటో చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దేశమంతటా ఈ చట్టాలకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిస్తే టీఆర్ఎస్ మౌనం వహించందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. దీంతో బిజెపి, టీఆర్ఎస్ ఒక్కటే అని తేలిపోయిందన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్కలు గుర్రపు బండి ఎక్కి వచ్చారు.
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ, కేంద్రం తీసుకువచ్చిన నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న భారత్ బంద్ లో భాగంగా గుర్రపు బండి పై నిరసన తెలుపుతూ వీరు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. వీరందరినీ అసెంబ్లీ ముందు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గుర్రపు బండిలో అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు వీరు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే సీతక్క కూడా అధికార టీఆర్ఎస్ వ్యవసాయ చట్టాలపై తన వైఖరి చెప్పాలన్నారు.