Telugu Gateway
Telangana

తెలంగాణ కాంగ్రెస్ లో మిగిలేది ఎవరు?!

తెలంగాణ కాంగ్రెస్ లో మిగిలేది ఎవరు?!
X

ఏ రాజకీయ నేత అయినా గెలిచే పార్టీలో ఉండాలని కోరుకుంటాడు. లేదా గెలుస్తామనే నమ్మకం ఉన్న పార్టీవైపు మొగ్గుచూపుతాడు. అదే రాజకీయ నేతల పని. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ కు ఇది అత్యంత గడ్డుకాలం అని చెప్పకతప్పదు. ఇప్పుడు అసలు ఆ పార్టీలో మిగిలేది ఎవరు?. అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. చెప్పుకోవటానికి తెలంగాణ ఇచ్చింది మేమే అనే ఓ బలమైన అంశం ఉన్నా దాన్ని వాడుకోవటంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఒకసారి కాకపోతే ఒకసారి కూడా ఆ క్రెడిట్ ను ఉన్న ఓటు బ్యాంకు కు జోడించలేకపోవటం ఒకెత్తు అయితే.. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా ఉన్న ఓటు బ్యాంకు కూడా పక్కదారి పడుతోంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఖాతాలో ఎన్నో అపజయాలను నమోదు చేసుకున్నారు. అందులో తాజా జీహెచ్ఎంసీ ఎన్నికలు మరకొటి.కాంగ్రెస్ పార్టీ రెండు అంటే రెండు స్థానాల్లోనే విజయం దక్కించుకుంది.

ఈ జీహెచ్ఎంసీ ఫలితాలు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు అంతా ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టగలిగే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ప్రస్తుతానికి బిజెపినే అన్న స్పష్టమైన సంకేతాలు జీహెచ్ఎంసీ ఫలితాలు చూపించాయి. తెలంగాణలో ఊహించని రీతిలో బిజెపి పుంజుకున్న తీరు చూసి రాజకీయ పరిశీలకులు కూడా విస్మయం చెందే పరిస్థితి. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది బిజెపి బలం అనే కంటే...టీఆర్ఎస్ పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత అని ఖచ్చితంగా చెప్పొచ్చు. చాలాసార్లు రాజకీయాల్లో సానుకూల అంశాల కంటే అధికారంలో ఉన్న వారి మీద వ్యతిరేకతే ప్రత్యర్ధుల గెలుపుకు దారిచూపుతాయి.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పీపీసీ అధ్యక్షుడిని మార్చినా లాభం ఉంటుందా?. ఒక్క తెలంగాణలోనే కాదు..దేశంలోనే కాంగ్రెస్ తన రాజకీయ వ్యూహాలను పునర్ రచించుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అంతే కాదు..అదే తరహా పాత రాజకీయం..ఒకడిని పది మంది పట్టుకుని కిందకులాగే ప్రయత్నాలు కొనసాగితే తమ పార్టీని ఇక ఎవరూ కాపాడలేరని ఓ సీనియర్ నేత చేసిన కామెంట్ అక్షర సత్యం. పది ఓట్లు లేని వాళ్ళు కూడా ఫామ్ లో ఉన్న వారిని పట్టుకుని లాగగలిగే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యం అని చెప్పొచ్చు.

Next Story
Share it