Telugu Gateway
Telangana

కాంగ్రెస్ సిక్సర్....సీఎం సీటు తెచ్చిపెడుతుందా?

కాంగ్రెస్ సిక్సర్....సీఎం సీటు తెచ్చిపెడుతుందా?
X

తెలంగాణ కాంగ్రెస్ సిక్సర్ కొట్టింది. ఆరు హామీలతో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యం వైపుగా గట్టి ప్రయత్నమే చేస్తోంది. బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పదేళ్ల పాలనపై వివిధ వర్గాల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యే హామీలతో అసలు టార్గెట్ చేరుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ హామీలు అధికార బిఆర్ఎస్ ను ఖచ్చితంగా ఇరకాటంలోకి నెట్టేవే అని చెప్పొచ్చు. పార్టీ ఏది అయినా ఇప్పుడు గెలుపే లక్ష్యంగా హామీల రేస్ కు దిగుతున్న విషయం తెలిసిందే. ఇందులో పెద్దగా ఎవరికీ మినహాయింపులు లేవు అనే చెప్పొచ్చు. కాంగ్రెస్ హామీలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయింది. ఈ సభకు జనం పెద్ద ఎత్తున హాజరు కావటం ఒకెత్తు అయితే...కర్ణాటక మోడల్ లోనే తెలంగాణాలో ఎలాగైనా ఈ సారి అధికారం చేజిక్కుంచుకోవాలి అనే కసితో కాంగ్రెస్ పార్టీ పని చేస్తోంది. సీనియర్ నేతల వరస చేరికలు కూడా ఆ పార్టీ లో జోష్ నింపుతున్నాయి. కొంత మంది సొంత పార్టీ నేతలు అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్లు వేసే ప్రయత్నం చేస్తున్నా కూడా తెలంగాణ కాంగ్రెస్ తన లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు అయిన తుక్కుగూడ సభలో సోనియా గాంధీ అతి తక్కువగా మాట్లాడినా...రాహుల్ గాంధీ మాత్రం చెప్పాల్సిన విషయాలు సూటిగా, స్పష్టంగా చెప్పి కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ తెచ్చే ప్రయత్నం చేశారు అనే చెప్పొచ్చు. ఒక సారి సోనియా గాంధీ మాట ఇస్తే అమలు చేసి తీరతారు అని..చెప్పిన మాట ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఇస్తాం అని చెప్పి ఇచ్చారు అంటూ ...అలాగే ఆమె విడుదల చేసిన ఆరు గ్యారంటీల అమలు విషయంలో కూడా హామీలను అమలు చేసి చూపిస్తాం అంటూ రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఈ హామీల విషయంలో నమ్మకం కలిగించే ప్రయత్నం గట్టిగా చేశారు అనే చెప్పాలి.

అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బిఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే అంటూ రాహుల్ విమర్శలు గుప్పించారు . దేశంలో ప్రతిపక్ష పార్టీలు అన్నింటిపై కేసు లు ఉన్నాయని....ఒక్క బిఆర్ఎస్ , ఎంఐఎం ల మీద తప్ప అంటూ వీళ్ళ బంధానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలని ప్రశ్నించారు. తెలంగాణాలో కాళేశ్వరం దగ్గర నుంచి పలు ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా కేంద్రం అసలు ఏ మాత్రం పట్టించుకోవటం లేదు అంటూ రాహుల్ ఆరోపించారు. ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, ప్రతి నెల మహిళలకు నెలకు 2500 రూపాయలు, ఆర్ టి సి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భోరోసా కింద రైతులు, కౌలు రైతులకు ప్రతి ఏటా 15000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు ఏటా 12000 రూపాయలు, వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్, ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత కింద నెల వారీ పెన్షన్ 4000 రూపాయలు, పది లక్షల ఆరోగ్య శ్రీ బీమా వంటి హామీలు బలంగా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకెళితే మాత్రం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దశ తిరిగే అవకాశాలు లేకపోలేదు అనే అంచనాలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ హామీలను అధికార బిఆర్ఎస్ ఎలా కౌంటర్ చేస్తుంది అనేది వేచిచూడాల్సిందే.

Next Story
Share it