Telugu Gateway
Telangana

కెసిఆర్ సవాల్ ను రేవంత్ రెడ్డి స్వీకరిస్తారా?

కెసిఆర్ సవాల్ ను రేవంత్ రెడ్డి స్వీకరిస్తారా?
X

టచ్ చేసి చూడు. రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో సినిమా డైలాగులు వాడుతున్నారు..అంతే కాదు. సినిమాటిక్ సవాళ్లు కూడా విసురుతున్నారు. తాజాగా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా అదే పని చేశారు. పెద్ద పెద్ద వాళ్ళను చూశా...తనను, తన పార్టీ ని టచ్ చేయటం రేవంత్ రెడ్డి సర్కారు వల్ల కాదు అంటూ సవాల్ విసిరారు. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సవాల్ ను స్వీకరిస్తారా..గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి రాబోయో రోజుల్లో యాక్షన్స్ కు దిగుతారా లేదా అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిరేపుతున్న అంశం. తాజా పరిణామాలు అన్ని చూస్తుంటే తెలంగాణ రాజకీయాలు రాబోయో రోజుల్లో మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక వైపు రేవంత్ రెడ్డి సర్కారు గత ప్రభుత్వ అక్రమాలపై వరసపెట్టి విచారణలు ఆదేశిస్తోంది. ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అక్రమాలు ఒక్క్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ కు సంబంధించి విజిలెన్సు నివేదిక కూడా ప్రభుత్వ చేతికి వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపట్టిని సంస్థ ఎల్ అండ్ టి కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసిన ఐదు నెలల్లోనే మేడిగడ్డ లో సమస్యలు బయటపడ్డాయని...వీటిపై అప్పుడే ఇరిగేషన్ శాఖకు సమాచారం ఇచ్చాం అని లేఖలు రాసినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి.

మరి ఇన్ని ఆధారాలు దగ్గర పెట్టుకుని రేవంత్ రెడ్డి సర్కారు ఈ విషయంలో ఎలా ముందుకు సాగుతుంది అన్నది అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. మరో వైపు ధరణి పేరుతో సాగించిన గోల్ మాల్ వ్యవహారాలు అన్ని కూడా ఇప్పుడు బటయకు వస్తున్నాయి. తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు గత ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ విజిలెన్సు విచారణకు ఆదేశించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిర్వహించిన మున్సిపల్ శాఖలో సాగిన అవినీతి దందాలు అన్ని రేరా కార్యదర్శి బాల కృష్ణ అరెస్ట్ తో వెలుగులోకి వస్తున్నాయి. బాలకృష్ణ ఆస్తులే వందల కోట్ల రూపాయలు ఉండగా...బినామీల పేరుతో వందల ఎకరాల భూములతో పాటు రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నట్లు కూడా ఏసీబీ గుర్తించింది. కేటీఆర్ నిర్వహించిన మరో విభాగం ఐటి శాఖలో కూడా వందల కోట్ల రూపాయల కొనుగోళ్లు ఇష్టానుసారం చేసినట్లు వార్తలు వచ్చాయి. మరి ఇన్ని అంశాలు దగ్గర పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి రానున్న కాలంలో బిఆర్ఎస్ ను...కెసిఆర్, కేటీఆర్ లను టచ్ చేస్తారా...చేయరా అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it