Telugu Gateway
Telangana

బందిపోట్లు అంటూ ఏడాదిగా నో యాక్షన్

బందిపోట్లు అంటూ ఏడాదిగా నో యాక్షన్
X

బందిపోట్లు. దోపిడీ దొంగలు. ఇవి బిఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ల నుద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సాక్షిగా చేసిన వ్యాఖ్యలు. ఇవి ఇప్పుడు కొత్తగా చేసినవి కాకపోవొచ్చు...గతంలో కూడా ఈ మాటలు చాలా సార్లు అన్నారు. బాధ్యత గల ముఖ్యమంత్రి హోదాలో ఉండి...అధికారాన్ని...అధికారులను అడ్డంపెట్టుకుని దోచుకున్నారు అని చెపుతూ వాళ్లపై ఈ ఏడాది కాలంగా ఒక్క కేసు పెట్టకుండా..ఒక విషయంలో యాక్షన్ తీసుకోకుండా పదే పదే మీడియా ముందు...బహిరంగ సభల్లో మాట్లాడితే వాటికి విలువ వస్తుందా?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత...చేతిలో అన్ని పవర్స్ పెట్టుకుని...కేవలం మాటలతోనే కాలం వెళ్లబుచ్చితే ఏమీ ఉపయోగం ఉండకపోగా...ప్రభుత్వం పరువే పోతుంది. అన్నిటికంటే దారుణం ఏంటి అంటే...బిఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు బాధితులకు పంచిన నగదు పంపిణీలో స్కాం జరిగింది అని చెపుతూ ఈ విషయంలో కేటీఆర్ విచారణకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసరటం విచిత్రంగా ఉంది.

కేటీఆర్ ఓకే అంటే 48 గంటల్లో విచారణకు ఆదేశిస్తా...సిద్ధమా అని మీడియా సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించటం చూసి అధికారులు కూడా షాక్ కు గురవుతున్నారు. అసలు రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అన్న చర్చ వాళ్లలో సాగుతోంది. పైగా విచారణ వేయటానికి స్కాం చేసిన వాళ్ళ అనుమతి...సమ్మతి కోరటం అన్నది బహుశా దేశంలో ఎక్కడా జరగదేమో. హైదరాబాద్ లో ఒక ప్రాజెక్ట్ లో కోట్ల రూపాయల స్కాం చేశారు అని చెపుతూ పోనీలే అని వదిలేస్తే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు అని రేవంత్ రెడ్డి ప్రకటించటం దుమారం రేపుతోంది. అంటే అన్ని విషయాలు తెలిసి...చేతిలో ఆధారాలు ఉండి కూడా కేటీఆర్ ను వదిలేసినట్లు చెప్పటం ద్వారా రేవంత్ రెడ్డి ప్రజలు ఎలాంటి సంకేతాలు పంపారు అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి తన ప్రెస్ మీట్ ద్వారా ఏ మేరకు ఆశించిన లక్ష్యం సాధించారో తెలియదు కానీ..బిఆర్ఎస్ నేతల విషయంలో మాత్రం ఆయన మాటలు సెల్ఫ్ గోల్ గా మారాయి అనే చర్చ విస్తృతంగా సాగుతోంది.

Next Story
Share it