ఎక్కడ చూసినా ఇదే చర్చ
రాజకీయాల్లో చూపించే దూకుడు పరిపాలనలో పనికిరాదు. ఒక వేళ పరిపాలనలో కూడా దూకుడు చూపించాలి అంటే అధికారంలో ఉన్నది ప్రాంతీయ పార్టీ అయి ఉండాలి...ఆ పార్టీ అధినేత తిరుగులేనివాడు అయి ఉండాలి. కాంగ్రెస్ లాంటి పార్టీ లో ఇలాంటి వాటికి అసలు ఛాన్స్ ఉండదు అనే చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. దీని ప్రధాన కారణం ముందు చేయాల్సిన పనులు చివరిలో ..వెనక చేయాల్సిన పనులు ముందు చేయటమే దీనికి ప్రధాన కారణం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణ కే కాకుండా ..దేశంలోనే హైదరాబాద్ అత్యంత కీలక నగరం. ఇంతటి కీలక నగరాన్ని వరదలు..మురికి నుంచి రక్షించి..సురక్షిత నగరంగా మార్చాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. హైదరాబాద్ లో నగరంలో వేలాది మంది సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవితాలను తలకిందులు చేసే అంతటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు చేయాల్సిన కసరత్తు...ముందస్తు ఏర్పాట్లు ఏమీ చేయకుండా నేరుగా రంగంలోకి దిగటం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.
మున్సిపల్ శాఖ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్న విషయం తెలిసిందే. హైడ్రా హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూలగొట్టేందుకు ముందే ప్రభుత్వంలోని కీలక శాఖలు అన్ని కలిపి ముందు చేయాల్సిన పని హైదరాబాద్ లోని అన్ని చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్ టిఎల్ ), బఫర్ జోన్లను నిర్దారించటం. కానీ ఇవేమి చేయకుండా నేరుగా కూల్చివేతలకు వెళ్ళటం వల్ల హై కోర్ట్ తో ప్రభుత్వం చీవాట్లు తినాల్సి వచ్చింది. అందుకు ముందు చేయాల్సిన పనులు వెనక...వెనక చేయాల్సిన పనులు ముందు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కారు రివర్స్ లో వెళుతుంది అనే విమర్శలు మూటగట్టుకుంటోంది. ఒక వైపు హైడ్రా వ్యవహారమే ఆగమాగంగా ఉంటే మూసి ప్రాంతంలో కూల్చివేతలు, మార్కింగ్ వ్యవహారం కూడా ఉద్రిక్తంగా మారుతోంది. గత పదేళ్ల కెసిఆర్ పాలనతో పోలిస్తే చాలా విషయాల్లో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాస్వాయయుతంగా వెళుతుంది అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. రైతు బంధు వంటి వాటి విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకుని..అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి పలు మార్లు బహిరంగంగా ప్రకటించారు.
అదే తరహాలో హైడ్రా తో పాటు మూసి ప్రాజెక్ట్ విషయంలో కూడా అసెంబ్లీ లో పూర్తి వివరాలు ప్రకటించి రంగంలోకి దిగి ఉంటే ఇప్పుడు ఎదుర్కొంటున్న విమర్శలకు ఛాన్స్ ఉండేది కాదు. మూసి పై బిఆర్ఎస్ గత కొన్ని రోజులుగా రచ్చ రచ్చ చేస్తుంటే నిన్న కానీ..అంటే మంగళవారం నాడు కానీ..మూసి ప్రక్షాళన, సుందరీకరణ నిర్ణయాలు బిఆర్ఎస్ హయాంలో తీసుకున్నవే అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా చెప్పలేకపోయింది. అంటే ఈ విషయం నిన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు...అధికారులకు తెలియాదా అన్న అనుమానాలు రాక మానవు. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే అక్రమ నిర్మాణం అని ప్రభుత్వ నిధులతో కట్టిన ప్రజా వేదిక ను కూల్చివేయించారు. ఈ ప్రభావం ఆయనపై ఐదేళ్లపాటు కొనసాగింది. వస్తూ వస్తూనే కూల్చివేతలతో పాలన మొదలుబెట్టారు అనే విమర్శలు ఎదుర్కొన్నారు. అది ప్రభుత్వ భవనం అయినా రాజకీయంగా ఆ కూల్చివేత జగన్ కు భారీ డ్యామేజ్ చేసింది అనే విషయం మొన్నటి ఎన్నికల ఫలితాల్లో తేలింది. కానీ ఇప్పడు రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి అక్రమ నిర్మాణాలను కూల్చితే ఎవరికీ ఇబ్బంది ఉండదు.
కానీ సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ప్రభావం పడేలా కూల్చివేతలు ఉంటే మాత్రం రాజకీయంగా కూడా ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరో వైపు ప్రభుత్వ శాఖల నుంచి నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని కట్టుకున్న ఇళ్లను తప్పనిసరి పరిస్థితుల్లో కూల్చివేయాల్సి వస్తే వాటికి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్స్ తెరమీదకు వస్తున్నాయి. ఎందుకంటే సామాన్య , మధ్య తరగతి ప్రజలు అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేప్పట్టినందున వాళ్ళ తప్పు ఏమీ లేనట్లే లెక్క. ప్రభుత్వ శాఖలు పర్ఫెక్ట్ గా..నిజాయతీగా పని చేసి ఉంటే ఆ నిర్మాణాలు వచ్చి ఉండేవి కావు అన్న విషయం తెలిసిందే. మరి తప్పు చేసిన ప్రభుత్వ శాఖలను వదిలేసి..పేదలు, మధ్యతరగతి పై ప్రతాపం చూపిస్తే అది ఖచ్చితంగా సర్కారు మెడకు చుట్టుకోవటం ఖాయం. ఇప్పుడు హైదరాబాద్ లోని పార్క్ లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఏ నలుగురు కలిసి మాట్లాడుకున్నా హైడ్రా కూల్చివేతలు...మూసి ప్రాజెక్ట్ వ్యవహారంపైనే చర్చలు సాగుతున్నాయి. ఈ విషయంలో ఎక్కువ మంది ప్రభుత్వ తీరునే తప్పుపడుతున్నారు.
ఒక్క వర్షం కురిస్తే చాలు హైదరాబాద్ లోని అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్ ల ముందు కూడా చెరువుల లాగా నీళ్లు నిలుస్తాయి...ఇది అంతా సమైక్య పాలకుల చేతకాని తనం అంటూ తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ విమర్శించిన సంగతి తెలిసిందే. తాము ఏడాది లోనే ఈ సమస్య లేకుండా చేస్తానని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన ఈ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాళేశ్వరం ఇంజనీర్ కెసిఆర్ పదేళ్ల తర్వాత ఇంటికి పోయారు తప్ప..ఇప్పటికే ఆ సమస్య అలాగే ఉంది. ఒక వైపు పదేళ్ల కెసిఆర్ సర్కారు చేసిన భారీ అప్పులు...కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుతో పాటు ఇంతటి భారీ ప్రాజెక్ట్ ల అమలు సాఫీగా ముందుకుసాగాలనుంటే కావాల్సింది దూకుడుగా పనిచేయటం కాదు...పక్కా ప్లానింగ్ అన్నది అధికారులు చెపుతున్న మాట. మరో వైపు కారణాలు ఏమైనా కానీ ముఖ్యమంతి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా అక్రమం అక్రమం అంటూ ఆరోపించిన మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా చెపుతున్న జన్వాడ ఫార్మ్ హౌస్ జోలికి ఇప్పటికి పోకపోవటంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా జన్వాడ ఫార్మ్ హౌస్ అక్రమం అయితే హైడ్రా నే దాన్ని కూల్చాల్సిన అవసరం ఏముంది...అక్కడ ప్రభుత్వ శాఖలు లేవా...ఈ పని చేయలేవా?!.