Telugu Gateway
Telangana

ప్రతిపక్షంలో స్ట్రాంగ్...అధికారంలో వీక్ !

ప్రతిపక్షంలో స్ట్రాంగ్...అధికారంలో వీక్ !
X

ప్రతిపక్షంలో ఉండగా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సాధించిన, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను ఢీకొట్టిన...ఢీకొట్టగల నాయకుడిగా చాలా మందికి కనిపించారు. ఆ ఇమేజే ఆయన్ను పీసీసీ పీఠంపై కూర్చోబెట్టడంతో సీఎం సీటు కూడా దక్కేలా చేసింది. కానీ ఏడాదిలోనే ఎంత మార్పు. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు చాలా మందిని విస్మయానికి గురి చేస్తున్నాయి అనే చెప్పాలి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణాలో కేబినెట్ విస్తరణ పై చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఏడాది దాటిన తర్వాత కూడా పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో సీఎం ఉన్నారు. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే రాష్ట్రంలో అత్యంత కీలకమైన హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాదు, ఆదిలాబాద్ తదితర జిల్లాలకు అసలు మంత్రివర్గంలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యమే లేదు.

మరో వైపు పరిపాలనలో ఎంతో ముఖ్యమైన హోమ్, విద్యా, మున్సిపల్ , కార్మిక శాఖలకు మంత్రులు కూడా లేరు. అయినా సరే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవులకు తాను ఎవరి పేర్లు సూచించలేదు అని..అధిష్టానమే దీనిపై నిర్ణయం తీసుకుంటుంది అని ఢిల్లీ లో చెప్పారు. ఇంకా కొన్ని నెలలు ఆగటం వల్ల ఎమ్మెల్యే ల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు...సామాజిక సమీకరణల్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. అలాంటప్పుడు మంత్రి వర్గ విస్తరణను ఇంకా జాప్యం చేయటం వల్ల అదనంగా కాంగ్రెస్ పార్టీ కి కలిగే ప్రయోజనం ఏమి ఉంటుంది అన్నదే ఎవరికీ అర్ధం కాని విషయం. ఇన్ని కీలక జిల్లాల్లో మంత్రి పదవులు ఖాళీ పెడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు బాధ్యత తీసుకుని పని చేస్తారు అన్న ప్రశ్న తలెత్తక మానదు. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై నాయకుల మధ్య విభేదాలు ఉంటే అందరిని కూర్చోబెట్టి పరిష్కరించాల్సింది కూడా అధిష్టానమే. అయితే సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి ఏడాదికి పైగా మంత్రి వర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉంచటం వల్ల వచ్చే సమస్యలపై అధిష్టానానికి చెప్పి...కన్విన్స్ చేసి పని జరిగేలా చూసుకోవాల్సింది కూడా ఆయనే. కానీ ఆయన మాత్రం అధిష్టానం చెపితే చేస్తా..లేకపోతే లేదు అన్న చందంగా వ్యవహరిస్తూ పోతుండంతో ప్రతిపక్షంలో ఉండగా బలమైన నేతగా కనిపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత బలహీనమైన నాయకుడుగా మారిపోయారు అనే ముద్ర వేసుకుంటున్నారు.

ఈ రకమైన ఫీలింగ్ కలిగే ఛాన్స్ ఆయనే స్వయంగా ఇస్తున్నారు అన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. ఒక వైపు పరిసపాలనలో ఎన్నో తడబాట్లు ఉంటే...ఇప్పుడు రాజకీయంగా కూడా మంత్రి వర్గ విస్తరణ వంటి విషయంలో నిర్ణయం తీసుకోలేకపోవటం వల్ల రాజకీయగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు నష్టం తప్పదు అనే చర్చ సాగుతోంది. వరస ఓటముల తర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టానం వైఖరిలో ఎలాంటి మార్పు రావటం లేదు. పోనీ సీఎం సీటు లో ఉన్న నాయకులు అయినా అధికారం ఇచ్చిన ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించేలా పూర్తి స్థాయి మంత్రి వర్గ విస్తరణ అవసరం ఏంటి అన్నది అధిష్టానం నేతలకు చెప్పి చేయించుకోవాలి. కానీ ఇప్పుడు ఆ రెండూ జరగటం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ గురించి బిఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలు నిజం అనే ఫీలింగ్ కలిగేలా అటు పార్టీ అధిష్టానం తో పాటు ఇటు స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా వ్యవహరిస్తున్నారు.

Next Story
Share it