బిఆర్ఎస్ ఎంపీ కి భారీ సాయం వెనక మతలబు ఏమిటో?
రద్దు చేసి ...వెంటనే పునరుద్ధరణ చేయటం అంటే...
తెలంగాణ లో రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి ఇంకా నిండా ఐదు నెలలు కూడా కాలేదు. కానీ అప్పుడే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్రమైన ఆరోపణలు రావటం కలకలం రేపుతోంది. అది కూడా కాంగ్రెస్ సర్కారు బిఆర్ ఎస్ ఎంపీ కి మేలు చేసేలా వ్యవహరించటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి అప్పటి బిఆర్ఎస్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతూ మీడియా ముందు జీఓ లతో సహా చూపిస్తూ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బిఆర్ఎస్ ఎంపీ, హెటిరో పార్థసారధి రెడ్డి కి చెందిన సాయి సింధు ఫౌండేషన్ కు కేటాయించిన భూమిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇది చూసి ఓహో రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ అని అంతా ఫీల్ అయ్యారు.. అయితే ఆ ఫీలింగ్ అటు అధికారులతో పాటు ఎవరిలో ఎంతో కాలం నిలవలేదు. ఎందుకు అంటే గత బిఆర్ఎస్ సర్కారు తీసుకున్న నిర్ణయంలో స్వల్ప మార్పులు చేసి మళ్ళీ సాయి సింధు ఫౌండేషన్ కు వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని తిరిగి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఎకరా రెండు లక్షల రూపాయల లెక్కన ముప్పై సంవత్సరాలకు లీజ్ కు ఇస్తే...ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు లీజ్ ను మాత్రం ఎకరా కు 5 లక్షల రూపాయలకు పెంచింది. ఇది ఒక్కటే రేవంత్ రెడ్డి సర్కారు చేసిన మార్పు.
ఈ మార్పులతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మార్చి 14 న ఉత్తర్వులు జారీ చేశారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమి విషయంలో ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకూ..ఇప్పుడు సీఎం గా చేసిన పనులకు మధ్య పొంతన లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసలు ఒక హాస్పిటల్ కు హైటెక్ సిటీ వంటి కీలక ప్రాంతంలో పదిహేను ఎకరాలు కేటాయించటం ఏ మాత్రం సరికాదు అనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేటాయింపుపై గతంలో తెలంగాణ హై కోర్ట్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా సరే రేవంత్ రెడ్డి సర్కారు కూడా గత బిఆర్ఎస్ బాటలో పయనించటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఆస్పతి నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయనే సాకు చూపెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బిఆర్ఎస్ బాటలోనే పయనించింది. దీంతో అధికారం మారినా కూడా పెద్దగా ఎలాంటి మార్పులు ఉండవు అనటానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణగా నిలుస్తాయి అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీ శాసన సభ పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఈ డీల్ వెనక వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ ఈ విషయాన్ని ఒక అస్త్రం గా వాడుకునే ఛాన్స్ ఉంది అనే చర్చ సాగుతోంది.