తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం
అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కెసీఆర్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇటీవల ప్రధాని మోడీతో సమావేశం అయిన సందర్భంగా పలు అంశాలపై గట్టిగా కూడా మాట్లాడినట్లు తెలిపారు. పలు అంశాల్లో కేంద్రం తెలంగాణాను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. కెసీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...' టూరిజంతో పాటు ఇతర విషయాల్లో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదు. తెలంగాణ చాలా చరిత్ర, సంప్రదాయాలు.. గొప్ప కళలతో కూడుకున్న ప్రాంతం. 58 సంవత్సరాలు సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణను పట్టించుకోలేదు. ప్రమోట్ చేయలేదు. అద్భుతమైన జలపాతాలు తెలంగాణలో ఉన్నాయి. ఖమ్మంలో పాండవుల గుట్టను పట్టించుకోలేదు. చారిత్రక ఉజ్వలమైన అవశేషాలు ఉన్న తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉంది. తెలంగాణలో కళాకారులు, విశిష్టమైన వ్యక్తులు ఉన్నారు. పద్మశ్రీ అవార్డుల కోసం జాబితాను పంపాలా? వద్దా? అని ప్రధాని మోదీ, అమిత్ షాను అడిగాను.
ఉమ్మడి ఏపీలో అలంపూర్‌లోని జోగులాంబ టెంపుల్‌ను పట్టించుకోలేదు. ఉద్యమ సమయంలో ఆర్డీఎస్ మీద జోగులాంబ నుంచే మొట్టమొదటిసారిగా పాదయాత్ర చేశాను. కృష్ణా, గోదావరి పుష్కరాల మీద కూడా ఉద్యమం చేశాను. తెలంగాణలోని ప్రకృతి సౌందర్యాలను కాపాడుకుంటాం. మన శాతావాహనుల చరిత్ర కూడా అంతే గొప్పది. నూతన పరిశోధకులు శాసనాలను వెలికితీస్తున్నారు. అన్ని జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం. చారిత్రాకమైన ప్రదేశాలు, కోటలు, దర్శనీయ స్థలాలు, విశిష్టమైన దేవాయాల ప్రాచుర్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఎయిర్ స్ట్రిప్స్ ఇవ్వాలని అడిగాం. ఆరున్నర సంవత్సరాలు గడిచిపోతోంది. కేంద్రం కాలయాపన చేస్తోంది' అని విమర్శించారు.