Telugu Gateway
Telangana

ఆర్టీసీ విలీనంపై నాలుక మడతేసిన సీఎం

ఆర్టీసీ విలీనంపై నాలుక మడతేసిన సీఎం
X

భూగోళం ఉన్నంత వరకు సాధ్యం కాదని వ్యాఖ్యలు

ఇప్పుడు చంద్రమండలం మీదకు వెళ్ళామా?

ఎన్నికల్లో గెలవటం కోసం బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏదైనా చెపుతారు...ఎన్ని మాటలైనా మారుస్తారు. సరిగా మరో నెల రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న వేళ ఆర్టీసీ ఉద్యోగులపై కెసిఆర్ చూపించిన ప్రేమ నిజమైనదేనా...కేవలం అవసరం కోసం..ఎన్నికల కోసం చూపించిందా అంటే...కచ్చితంగా రెండవదే నిజం అని చెప్పక తప్పదు. ఎందుకంటే సరిగా మూడేళ్ళ క్రితం ఆర్టీసీపై కెసిఆర్ చెప్పిన మాటలు చూసిన వారికీ ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. దేశంలో రాజకీయ నాయకులకు మాటలు మార్చే అవార్డు అంటూ ఏదైనా పెడితే అందులో ఫస్ట్ ప్లేస్ తెలంగాణ సీఎం కెసిఆర్ కె వస్తుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసలు ఏ మాత్రం హడావుడి లేకుండా...ఈ నిర్ణయం వెలువడటం అంటే పూర్తి రాజకీయ కోణంలో ఎన్నికల్లో లబ్ది పొందటం...మరో ఛాన్స్ అంటూ వస్తే ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను తెగనమ్మినట్లు ...తర్వాత ఆర్టీసీ ఆస్తులపై కన్నేయవచ్చు అనేది అసలు ప్లాన్ గా అధికారులు చెపుతున్నారు. అప్పులతో పాటు ఆర్టీసీ కి రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద సమ్మెగా ఏకంగా 52 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన సందర్భంగా సీఎం కెసిఆర్ ఏమి అన్నారో అయన మాటల్లోనే..‘ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం జరిగే పని కాదు. ఆర్టీసీ విలీనం చేస్తే అది అక్కడితో ఆగేది కాదు.

ప్రభుత్వం లో కలపటం అన్నది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంతకాలం జరిగేది కాదు. రాష్ట్రంలో ఇంకా 91 కార్పొరేషన్ లు ఉన్నాయి. చిన్నవి...పెద్దవి అన్ని కలిపితే. వాళ్ళు అందరూ కూడా మమ్మల్ని విలీనం చేయమంటారు. చేయమంటే మేము నిరాకరించలేని పరిస్థితి వస్తది. వాళ్ళు కోర్టు కు పోతారు. ఇవే కొర్టు లు మమ్మల్ని ప్రశ్నిస్తాయి. ఆర్టీసీ ని ఎందుకు చేసినవ్..వీళ్ళను ఎందుకు చేయలేదు అనే ప్రశ్న వస్తది . కాబట్టి అది జరిగే పని కాదు. అది ఇంపాసిబుల్ టాస్క్. నిర్ద్వందంగా క్యాబినెట్ దాన్ని తోసిపుచ్చింది. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు కూడా దాన్ని మార్చలేరు. బాగా లోతుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది క్యాబినెట్ నిర్ణయం. ఇందులో మార్పు ఉండదు. ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రయోగం చేశారు. చూద్దాంగా ఏమి జరుగుతుందో. అక్కడ ఏమీ మన్నుకూడా జరగల. మీకు తెలవదు.’ అంటూ అప్పటిలో ప్రశ్నలు అడిగిన మీడియా పై కూడా విరుచుకుపడ్డారు. అప్పుడు లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు లైట్ గా తీసుకున్నారా?. భూగోళం ఉన్నత కాలం కాదు అని చెప్పిన కెసిఆర్ అసలు కార్మికుల నుంచి ఇప్పుడు ఆ డిమాండ్ లేక పోయినా ఎందుకు తెరమీదకు తెచ్చారు. అంటే ఎన్నికల కోసమే అని స్పష్టంగా చెప్పొచ్చు.

Next Story
Share it