Telugu Gateway
Telangana

కెసిఆర్ స్పందించాలంటే ఇంకా ఎంత మంది జర్నలిస్ట్ లు చనిపోవాలో?!

కెసిఆర్ స్పందించాలంటే ఇంకా ఎంత మంది జర్నలిస్ట్ లు చనిపోవాలో?!
X

సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోరు

ఎనిమిది నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వని కెసిఆర్ !

డబ్బులు కట్టి పదేళ్లు దాటినా ఏ విషయం చెప్పరు

డబ్బులు కట్టి...స్థలాలు కేటాయించి కూడా పద్నాలుగు సంవత్సరాలు పైనే అయింది. ఆ డబ్బులు కట్టడానికి కూడా అరకొర జీతాలు ఉన్న వాళ్ళు అప్పులు చేసి మరి ఈ మొత్తాలను చెల్లించారు. వీటి కోసం చూస్తూ చూస్తూనే ఇప్పటికే దాదాపు అరవై మంది జర్నలిస్ట్ లు తుది శ్వాస విడిచారు. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత సుప్రీం కోర్టు గత ఏడాది ఆగష్టు లో ఇప్పటికే డబ్బులు కట్టిన హౌసింగ్ సొసైటీ కి స్థలం ఇవ్వటంతో పాటు ఇళ్ల నిర్మాణానికి కూడా అనుమతి ఇస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాలపై మీడియా సాక్షిగా పదుల సంఖ్యలో హామీలు ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా కూడా ఇంత వరకు జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాల అంశంపై మాట్లాడేందుకు ఒక్క పది నిముషాలు అంటే పది నిమిషాల సమయం సీఎం కెసిఆర్ కేటాయించటం లేదు. ఎన్నిరకాలుగా ప్రయత్నాలు చేసినా ఎనిమిది నెలల్లో ఇది కార్యరూపం దాల్చలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. దీంతో పదకొండు వందల మంది జర్నలిస్ట్ లు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. డబ్బులు కట్టి...స్థలం కేటాయించి పద్నాలుగు సంవత్సరాలు కావటం ఒకెత్తు అయితే...సుప్రీం తీర్పు వచ్చి ఎనిమిది నెలలు అయినా కూడా అసలు మీకు ఇస్తామనో...ఇవ్వమనో ఏమీ చెప్పకుండా కెసిఆర్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు మాత్రం దారుణంగా ఉంది అనే చర్చ సాగుతోంది.

సుప్రీం ఆదేశాలను కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా..కనీసం ఏ విషయం కూడా చెప్పకుండా మౌనం దాల్చుతున్నారు. లక్షలకు లక్షలు జీతాలు తీసుకునే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ ల కేసు పెండింగ్ లో ఉండటం ఒక్క జర్నలిస్ట్ ల కేసు తేలటం వల్ల కూడా వీరిలో అసహనానికి కారణం అయింది అనే చర్చ సాగుతోంది. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన వెంటనే దీర్ఘకాల సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అయింది అంటూ ట్వీట్ చేసిన మంత్రి కెటిఆర్ కూడా ఈ విషయంలో పెద్దగా పట్టించుకోవడంలేదు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ పెద్దలే ఇప్పటికే ఒక సొసైటీకి కేటాయించిన భూమి అప్పగించకుండా...కొత్త జర్నలిస్ట్ లతో లింక్ పెట్టి ఈ వ్యవహారాన్ని రచ్చ చేస్తోంది. దీంతో ఇంక ఎంత మంది జర్నలిస్ట్ లు చనిపోతే కానీ కెసిఆర్ స్పందిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. పోనీ ఇవ్వదల్చుకోక పోతే ఆ విషయం అయినా తేల్చిచెప్పాలి. అది కూడా చేయటం లేదు. సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోరు...మాట్లాడానికి జర్నలిస్ట్ లకు సమయం ఇవ్వరు...ఇస్తారో..ఇవ్వరో చెప్పరు. తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం జర్నలిస్ట్ ల గురించి గొప్పగా మాట్లాడే సీఎం కెసిఆర్ ఇప్పుడు మాత్రం అసలు వాళ్ళు ఎవరు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.



Next Story
Share it