అది మీడియా అందరి సమస్య..అయినా కెసిఆర్ అపాయింట్మెంట్ దక్కదు!
పద్నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి సర్కారు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ కి కేటాయించిన భూమి కోసం చూస్తూ చూస్తూ ఏకంగా నలభై మంది సభ్యుల వరకు తనువు చాలించారు. వీళ్ళ కుటుంబాల పరిస్థితి వర్ణనాతీతం. చనిపోయిన సభ్యుల కుటుంబాలకు ప్లాట్స్ ఇవ్వాలని జనరల్ బాడీ సమావేశం లో నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన సభ్యులు కూడా అంతా దగ్గర దగ్గర 20 నుంచి 25 సంవత్సరాల పైగా సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్లే ఉన్నారు. అంతే కాదు చాలామంది రిటైర్ కూడా అయ్యారు. ఈ వ్యవహారం ఏ ఒక్కరిదో కాదు. ఇందులో ఈనాడు, ఆంధ్ర జ్యోతి, సాక్షి, వార్త, ఆంధ్ర ప్రభ, ఇప్పుడు కెసిఆర్ ఫ్యామిలీకి చెందిన నమస్తే తెలంగాణ, టి న్యూస్ లో పనిచేస్తున్నవారు కూడా ఉన్నారు. అంతే కాదు ప్రధాన ఆంగ్ల పత్రికలు హిందూ, డెక్కన్ క్రానికల్, టైమ్స్ అఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ ప్రెస్ , హన్స్ ఇండియా వంటి పేపర్స్ లో పని చేసే వాళ్ళు ఉన్నారు. అన్ని ప్రధాన టీవీ చానెల్స్ జర్నలిస్టులు కూడా ఇందులో భాగస్వాములే. ఫోటో జర్నలిస్టులు కూడా ఇందులో ఉన్నారు. ఇంత మందితో ముడి పడి ఉన్న అంశంలో ప్రభుత్వ తీరు చూసి ఐఏఎస్ అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. సుప్రీమ్ కోర్ట్ లో కేసు క్లియర్ కావటానికి అవసరం అయిన అఫిడవిట్ తెలంగాణ ప్రభుత్వం వేసింది.అంతా వరకు సహకరించింది. కానీ సుప్రీమ్ కోర్ట్ అడ్డంకులు అన్ని తొలిగించన తర్వాత కూడా ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో సానుకూలంగా స్పందించక పోవటంతో అందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
సొసైటీ కి అప్పగించాల్సిన పేట్ బషీరాబాద్ అంశంపై సీఎం కెసిఆర్ తో కలిసేందుకు ప్రయత్నాలు చేసినా అవి ఫలించటంలేదు. జర్నలిస్టులు సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేయటం అంటే...తెలిసిన మంత్రులు..ఎమ్మెల్యేల ద్వారా చేయటం తప్ప లెటర్స్ రాస్తే పని కాదనే సంగతి తెలిసిందే. కొద్దీ రోజుల క్రితం మంత్రి కెటిఆర్ జరిపిన మీడియా చిట్ చాట్ లో జర్నలిస్టులు సీఎం అపాయింట్మెంట్ గురించి ప్రస్తావిస్తే మీకు ఇస్తే మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటి..తర్వాత చూద్దాం అని కేటీఆర్ అన్నట్లు ఆ సమావేశంలో ఉన్న వాళ్ళు చెప్పారు. మిగిలిన వాళ్లకు ఇవ్వద్దని ఎవరు చెప్పటం లేదు. నిజముగా ప్రభుత్వం అందరికి ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఎందులోనూ సభ్యులు కానీ వాళ్ళతో అయినా ఒక సమావేశం పెట్టి సొసైటీ రిజిస్ట్రేషన్..అప్లికేషన్ల స్వీకరణ వంటి ప్రాసెస్ మొదలుపెట్టి ఉండేది. కానీ అదేమీ జరగటం లేదు. ఇప్పటికే భూమి ఇచ్చిన వాళ్ళ విషయంలో ఎలా వ్యవరిస్తున్నారో...ఇతర అర్హుల విషయంలోనే అలాగే చేస్తున్నారు. కొత్తవాళ్ల ప్రాసెస్ స్టార్ట్ చేసి పూర్తి చేయటానికే చాలా సమయం పడుతుంది. కానీ తెలంగాణ సర్కారు హైదరాబాద్ కేంద్రంగా పని చేసే జర్నలిస్టులు అందరి విషయంలో ఒక లాగే వ్యవహరిస్తోంది.