సీఎంఓ పేస్ బుక్ పేజీని అప్ డేట్ చేయని ఐటి శాఖ
ఇది సోషల్ మీడియా యుగం. అటు ప్రభుత్వాలు...ప్రైవేట్ వ్యక్తులు సోషల్ మీడియా ను విరివిగా ఉపయోగిస్తున్న కాలం ఇది. తెలంగాణాలో కొత్త ప్రభుత్వం వచ్చి మూడు రోజులు అయినా...తెలంగాణ సీఎంఓ పేస్ బుక్ పేజీని ఇంతవరకు అప్ డేట్ చేయలేదు. చివరకు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన ఫోటో లతో పాటు ఒక్క అప్ డేట్ కూడా అందులో కనిపించటం లేదు. కెసిఆర్ సీఎం గా ఉన్న సమయంలో అన్ని అధికారిక కార్యక్రమాలు..ప్రభుత్వ వ్యవహారాలకు సంబందించిన పోస్ట్ లు పెట్టేవారు. ఈ పేజీ ని తెలంగాణ ఐటి శాఖ నిర్వహిస్తోంది. కానీ ఈ ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ కు తెలంగాణాలో కొత్త ప్రభుత్వం వచ్చిన విషయం కూడా తెలియదు ఏమో పాపం. లేకపోతే అయన ఇంకా బిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన విషయాన్నీ జీర్ణించుకోలేకపోతున్నారేమో అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. సహజంగా ఏ ప్రభుత్వంలో అయినా..కీలక శాఖల్లో అధికారులను మూడు, నాలుగేళ్లకు మారుస్తూ ఉంటారు. ఎందుకు అంటే..సుదీర్ఘకాలం అక్కడే ఉంటే అధికారులు పక్కదారి పడతారు అనే అభిప్రాయంతో ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు.
కానీ బిఆర్ఎస్ పాలనలో జయేష్ రంజన్ సంప్రదాయానికి బిన్నంగా సుదీర్ఘ కాలంగా పలు కీలక శాఖలు చూస్తూ ఒక వెలుగు వెలిగారు. కేటీఆర్, జయేష్ రంజన్ లు చేసిన విదేశీ పర్యటనలు కూడా అన్ని ఇన్నీ కావు. ప్రతిపక్షంలో ఉండగా ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి పలు మార్లు ఆయనపై విమర్శలు కూడా చేశారు. తెలంగాణ సీఎంఓ పేస్ బుక్ పేజీ లో లేటెస్ట్ అప్ డేట్ అంటే...డిసెంబర్ 1 న అప్పటి సీఎం కెసిఆర్ నాలుగో తేదీన సచివాలయంలో క్యాబినెట్ సమావేశం పెడతారు అని మాత్రమే ఉంది. ఇదే చివరి పోస్ట్. కానీ తర్వాత కొత్త సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు...శనివారం నాడు అసెంబ్లీ లో కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఇవేమి ఐటి శాఖ చూసే తెలంగాణ సీఎంఓ పేస్ బుక్ పేజీల్లో కనిపించకపోవడం అధికార వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.