లాక్ డౌన్ దిశగా తెలంగాణ!
అత్యవసర కేబినెట్ అందుకేనా?
కరోనా నియంత్రణకు అన్ని రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలో ఒక్క తెలంగాణలోనే లాక్ డౌఃన్ లేదు. ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక రూపంలో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం కేవలం రాత్రి కర్ఫ్యూ మాత్రమే అమల్లో ఉంది. దీని వల్ల పెద్దగా ఫలితం ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. అకస్మాత్తుగా ముఖ్యమంత్రి కెసీఆర్ మంగళవారం నాడు కేబినెట్ సమావేశానికి నిర్ణయం తీసుకోవటంతో దీనికి మరింత ఊతం ఇచ్చినట్లు అయింది. రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపు పై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనున్నది. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కూడా కరోనా అంతగా తగ్గుతలేదని, సరియైన ఫలితాలు లేవని రిపోర్టులు అందుతున్నవి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధింపు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
కొన్ని వర్గాలు లాక్ డౌన్ కావాలని కోరుకుంటున్నపరిస్థితి కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో.. లాక్ డౌన్ విధించడం వల్ల కలిగే సాదకబాదకాలతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోల్ల ప్రక్రియమీద లాక్ డౌన్ ప్రభావం ఏమేరకు ఉంటుందనే అంశం పై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నది. అయితే లాక్ డౌన్ అమలు చేస్తున్న ఢిల్లీ వంటి నగరాల్లో తాజాగా కేసులు తగ్గుముఖం పట్టడంతోపాటు పాజిటివిటి రేటు కూడా తగ్గుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. కానీ ప్రభుత్వ వర్గాలు మాత్రం మొదటి నుంచి లాక్ డౌన్ వల్ల ఉపయోగం ఉండదని ప్రచారాన్ని తెరపైకి తీసుకు రావటం విశేషం. ఈ తరుణంలో లాక్ డౌన్ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంకేతాలు పంపటం కీలకంగా మారింది.