Telugu Gateway
Telangana

ఆహార శుద్ధి..లాజిస్టిక్ పాలసీల‌కు మంత్రివ‌ర్గం ఆమోదం

ఆహార శుద్ధి..లాజిస్టిక్ పాలసీల‌కు మంత్రివ‌ర్గం ఆమోదం
X

తెలంగాణ మంత్రివ‌ర్గం అత్యంత కీల‌క‌మైన ఆహార శుద్ధి విధానం, తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ' కి ఆమోదం తెలిపింది. వ‌ర‌స‌గా రెండ‌వ రోజు కూడా స‌మావేశం అయిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు. పారిశ్రామిక, ఈ కామర్స్, సేవా రంగాలలో రాష్ట్రం దినదినాభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో, అందుకనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ రూపొందించిన ' తెలంగాణ లాజిస్టిక్స్ పాలసి' ని కేబినెట్ ఆమోదం తెలిపింది. కరోనా స‌మ‌యంలో బయట తిరగలేని పరిస్థితుల్లో ప్రజలకు వస్తు సేవలు అందుబాటులోకి రావడానికి లాజిస్టిక్స్ రంగం ఎంతగానో ఉపయోగ పడ్డదని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఈ కామర్స్ సంస్థలు లాజిస్టిక్ రంగాన్ని వినియోగించుకుని ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్నాయని గుర్తించింది. వ్యవసాయ రంగంలో సాధించిన అభివృద్ధి తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా సాధించే అధనపు వాణిజ్యానికి లాజిస్టిక్ రంగాభివృద్ధి ఎంతో అవసరం అని గుర్తించింది. రాష్ట్రంలో సుమారు 1400 ఎకరాల్లో భారీ స్థాయిలో డ్రై పోర్టును (మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును) పీపీపీ పద్దతిలో ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడానికి కస్టమ్స్ శాఖ అనుసంధానంతో, సనత్ న‌గ‌ర్ లో ప్ర‌స్తుతం ఉన్న కాంకర్ ఐసిడి తరహాలో కొత్తగా మరో రెండు ఇంటిగ్రేటెడ్ కంటేనర్ డిపో (ఐసీడీ)లను స్థాపించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. బాటసింగారంలో ఏర్పాటు చేసిన మాదిరి, రాష్ట్రవ్యాప్తంగా మరో 10 ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కులను నెలకొల్పడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

500 ఎకరాలకు తగ్గకుండా 1000 ఎకరాల వరకు తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేసి 2024 -25 సంవత్సరం వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాలల్లో ఏర్పాటు లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మార్గదర్శకాల ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం భూమిని సేకరించి ఏర్పాటు చేసిన జోన్లలో అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే అభివృద్ది చేసి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హతమేరకు అందులో భూమిని కేటాయించాలని నిర్ణయం. తద్వారా సుమారు 25 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించి, 70 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి 3 లక్షల మందికి పరోక్ష ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది. విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో కూడిన స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందించాలని నిర్ణయం. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా 'ప్లగ్ అండ్ ప్లే' పద్దతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయం. వ్యవసాయ రంగంలో సాంకేతికతను మరియు నైపుణ్యాన్ని పెంచే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ విధానాన్ని అమలు పరచాలని అధికారులను అదేశించింది.

Next Story
Share it