Telugu Gateway
Telangana

ద‌ళిత బంధు కోసం 17,700 కోట్ల రూపాయ‌లు

ద‌ళిత బంధు కోసం 17,700 కోట్ల రూపాయ‌లు
X

తెలంగాణ స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ద‌ళిత బంధు కోసం బ‌డ్జెట్లో భారీ కేటాయింపులు చేశారు. సంప్ర‌దాయానికి భిన్నంగా ఈ సారి స‌మావేశాల ప్రారంభం రోజునే మంత్రి హ‌రీష్ రావు బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈసారి బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగం లేకుండానే మొదలైన సంగతి తెలిసిందే. 2022-223 బడ్జెట్‌కు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ద‌ళిత బంధు ప‌థ‌కానికి ఈ ఏడాది ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు నిధుల‌ను భారీగా పెంచారు. గ‌త వార్షిక బ‌డ్జెట్‌లో వెయ్యి కోట్ల‌ను కేటాయించ‌గా ఈసారి ఏకంగా వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం 17,700 కోట్ల రూపాయ‌లు బడ్జెట్ లో కేటాయించారు. ఈ ప‌థ‌కం ద్వారా వ‌చ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్లో 17,700 కోట్ల రూపాయ‌లు ప్ర‌తిపాదించారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధనను అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయలతో దశల వారీగా పాఠశాలల్లో అభివృద్ది పనులను ప్రభుత్వం చేపడుతున్నది. మొదటి దశలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రారంభించింది.

రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వ విద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో వంద కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతిపాదించారు. దీంతోపాటు రాష్ట్రంలో కొత్తగా అటవి విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణ‌యించింది. ఇందు కోసం ఈబడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలను కేటాయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాబోయే రెండేళ్ల‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ సంవత్సరం కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలలను, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, వికారాబాద్‌, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 2023 సంవత్సరంలోని రాష్ట్రంలోని మిగతా ఎనిమిది జిల్లాలైన మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగు, వరంగల్‌, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నూతన మెడికల్‌ కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్‌లో 1000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. 2022-23 సంవత్సరంలో బడ్జెట్లో పామాయిల్ సాగును ఎక్కువగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

ఇందు కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో 1000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. వ్యవసాయ రంగానికి గత ఏడేళ్లుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తోంది. గత ఎనిమిది వ్యవసాయ సీజన్లలో రైతు బంధు పథకం కింద 50,448 కోట్ల రూపాయలను 63 లక్షల మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. రైతు భీమా పథకం ద్వారా రైతు మరణిస్తే వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇలా ఇప్పటి వరకు 75 వేల కుటుంబాలకు 3,775 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసింది. ఇలా రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాం. ఈ వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొత్తంగా 24254 కోట్ల రూపాయలు కేటాయించాం. గతంలో హామీ ఇచ్చినట్టుగా ఈ ఏడాది 75 వేల లోపు రుణాలను కూడా మాఫీ చేయాలని నిర్ణయించిన‌ట్లు హ‌రీష్ రావు వెల్ల‌డించారు. వృద్ధాప్య ఫింఛన్ల మంజూరు కోసం విధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్లనుంచి 57 ఏళ్లకు తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్దిదారులకు ఆసరా ఫించన్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఆసరా ఫించన్ల కోసం 2022-2023 వార్షిక బడ్జెట్‌లో 11728 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది.

Next Story
Share it