Telugu Gateway
Telangana

తెలంగాణ 'బిజెపి పల్లెబాట‌'

తెలంగాణ  బిజెపి పల్లెబాట‌
X

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణాలో ఎలాగైనా అధికారం ద‌క్కించుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న బిజెపి కీలక నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో గ్రామాల్లో పార్టీని మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ దిశ‌గా పక్కా ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగ‌నుంది. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో బిజెపికి ఓ మోస్తరు బ‌లం ఉన్నా..ప‌ల్లెల్లో కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే బిజెపి చాలా బ‌ల‌హీనంగా ఉంద‌ని గుర్తించారు. అందుకే ఇప్పుడు కేంద్రం నుంచి జాతీయ స్థాయి నాయ‌కుల‌తోపాటు కేంద్ర మంత్రులు తెలంగాణ‌కు వ‌స్తే వారంద‌రినీ ప‌ల్లెబాట ప‌ట్టించాల‌ని నిర్ణ‌యించారు. భారీ ఎత్తున గ్రామాల్లో కూడా ప్ర‌చారం నిర్వ‌హించ‌టం..కేంద్రం చేసిన ప‌నులను చెప్ప‌టం ద్వారా ప‌ట్టు సాధించేందుకు ప్ర‌య‌త్నించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్ర‌స్తుతం అధికార టీఆర్ఎస్ పై పోరాటం ఓకే అనుకున్నా జిల్లాల‌ స్థాయిల్లో మాత్రం అంత ఆశాజ‌న‌కంగా లేద‌ని గుర్తించారు.

అందుకే అధిష్టానం దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు ఆదేశించింది. రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిల్లోనూ..నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలోనూ టీఆర్ఎస్ పై రాజ‌కీయ విమ‌ర్శ‌ల దాడిని పెంచ‌నున్నారు. బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల‌కు హైద‌రాబాద్ ను వేదిక‌గా ఎంచుకోవ‌టం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల‌పై తాము ఎంత‌గా ఫోక‌స్ పెడుతున్నామో బిజెపి చెప్ప‌క‌నే చెప్పింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా టీఆర్ఎస్ ను అధికారంలోకి రాకుండా చూడ‌టంతోపాటు..కాంగ్రెస్ పార్టీకి అధికారం చిక్క‌కుండా చేయాల‌నేది ఆ పార్టీ ప్లాన్. అయితే ఇప్ప‌టికీ బిజెపికి చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌రైన నేత‌లే లేరు అని ఆ పార్టీ నేత‌లు కూడా అంగీక‌రిస్తున్నారు. ఈ త‌రుణంలో బిజెపి ఎలా ప్ర‌ధాన పోటీ ఇస్తుంది అన్న‌ది కూడా కీలకంగా మార‌నుంది.

Next Story
Share it