Telugu Gateway
Telangana

బీజేపీ అవకాశాలు వీక్...అసమ్మతి పీక్!

బీజేపీ అవకాశాలు  వీక్...అసమ్మతి పీక్!
X

బీజేపీ అధిష్టానం తెలంగాణ పార్టీలో చేసిన మార్పులతో ఇప్పుడు ఒకే ఒక్కరు హ్యాపీగా కనిపిస్తున్నారు. ఆయనే ఈటల రాజేందర్. అయితే ఇది నిజమైన హ్యాపీయేనా..లేక సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన ఈటల రాజేందర్ ఇరుక్కు పోయారా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి ...ఈ బాధ్యతలు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కి అప్పగించారు. అదే సమయంలో ఈటల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పదవుల ప్రకటన వచ్చిన తర్వాత పార్టీ లో ఉత్సహంగా, జోష్ తో ఉన్నది ఒక్క ఈటల తప్ప మరొకరు లేరు అని చెప్పొచ్చు. మరో సారి పార్టీ మారటం ఇష్టం లేకే ఈటల రాజేందర్ బీజేపీ లో కొనసాగటానికి నిర్ణయం తీసుకున్నారు అని చెపుతున్నారు. నూతన తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా నియమితులు అయినా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అసలు ఈ అంశంపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడం లేదు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కిషన్ రెడ్డిలో అసంతృప్తి ఉన్నా అధిష్టానం అప్పగించిన బాధ్యత నుంచి తప్పించుకునే ఛాన్స్ లేదు. అయితే గతంలో ఎన్నడూ లేని రీతిలో తెలంగాణ బీజేపీ లో అంతర్గత విభేదాలు పీక్ కు చేరటం...మరో నాలుగైదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి ఇది పెద్ద సవాలుగా మారబోతుంది. కిషన్ రెడ్డి తో పోలిస్తే బండి సంజయ్ ది దూకుడు స్వభావం. ముఖ్యంగా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శల విషయంలో సంజయ్ దూకుడుగా వెళ్లారు. ఇప్పుడు కిషన్ రెడ్డి మరి అంత దూకుడు చూపిస్తారా అంటే సందేహమే అని చెప్పొచ్చు. అంతే కాదు..ఎప్పుడైతే కిషన్ రెడ్డి పేరును రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించారో...ఆ వెంటనే సోషల్ మీడియా లో కూడా ఈ మార్పు బిఆర్ఎస్ కు మేలు చేయటానికే అంటూ పెద్ద కామెంట్స్ వచ్చాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే రాబోయే రోజుల్లో ఎన్నికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ కు ఎంత ఫ్రీ హ్యాండ్ లభిస్తుంది...ఆయన బిఆర్ఎస్ విషయంలో దూకుడుగా వెళ్ళటానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నది ఇప్పుడు కీలక అంశాలుగా మారబోతున్నాయి.

నిన్న మొన్నటి వరకు తెలంగాణ బీజేపీ నేతలతో పాటు, కేంద్ర బీజేపీ నేతలు కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం, కెసిఆర్ సర్కార్ అవినీతి అంశాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఏ ఒక్క అంశంలో చర్యల దిశగా ముందుకు సాగకుండా కేవలం విమర్శలు చేస్తూ ముందుకు సాగితే రాజకీయంగా ఉపయోగం ఉంటుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీ లో చేరి ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోగొట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం. ఢిల్లీ లో అధిష్టానం పెద్దలను కలవటానికి వెళ్లే ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ కవిత అరెస్ట్, కెసిఆర్ సర్కారు అవినీతిపై చర్యలు ఉంటేనే బీజేపీ ని తెలంగాణ లో నమ్మే అవకాశం ఉంది అని..లేకపోతే ఇద్దరూ ఒకటే అనే అనుమానాలు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం పార్టీ లో మార్పులు చేసి వదిలేస్తుందా...లేక మరింత ముందుకు వెళుతుందా అన్నది ఇప్పుడు కీలకంగా మారనుంది. అయితే ఎక్కువ మంది నేతలు మాత్రం తెలంగాణ లో కాంగ్రెస్ ను నిలువరించడానికి అటు బిఆర్ఎస్, బీజేపీ లు పరస్పరం సహకరించుకోవటం, లోక్ సభ ఎన్నికల్లో కూడా పరస్పర సహకారం కోసం అంగీకారం కుదిరింది అనే ప్రచారం జోరందుకుంది. కేంద్ర ప్రభుత్వం తరపున ఎలాంటి యాక్షన్స్ ఉండకపోతే మాత్రం ఇదే అభిప్రాయం మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. కొంత కాలం క్రితం వరకు జోష్ లో ఉన్న బీజేపీ గత కొంత కాలంగా పూర్తిగా డీలా పడిపోయింది అని..ఇప్పుడు అది పరుగులు పెట్టడం అంటే అంత ఈజీగా జరిగే పని కాదు అని చెపుతున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో.

Next Story
Share it