భూముల అమ్మకానికి మేం వ్యతిరేకం
తెలంగాణ సర్కారు భూముల అమ్మకం ప్రతిపాదనపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బిజెపిలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై కాంగ్రెస్ తరపున సిఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క స్పందించగా..బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకానికి తాము వ్యతిరేకం అని తెలిపారు. ప్రభుత్వ భూములను ప్రజోపయోగ అవసరాల కోసం వినియోగించాలి కానీ..విక్రయించకూడదన్నారు. గతంలోనూ తాము భూముల విక్రయాలను వ్యతిరేకించామన్నారు.
ప్రభుత్వం భూములకు కస్టోడియన్ గా ఉండాలే తప్ప..విక్రయించకూడదన్నారు. ప్రభుత్వ భూములను పేదలకు ఇళ్ళ స్థలాలు, ఆస్పత్రులు, యూనవర్శిటీలు, ఇతర మౌలికసదుపాయాల కల్పనకే ఉపయోగించాలన్నారు. అంతే కానీ ప్రభుత్వ భూములను విక్రయించి ఆదాయం సమకూర్చుకోవాలనుకోవటం ఏ మాత్రం సరికాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం భూముల విక్రయాన్ని ఆపకపోతే తాము ప్రజాఉద్యమం నిర్మిస్తామని ఓ ప్రకటనలో హెచ్చరించారు.