బిఆర్ఎస్ ను ఊడ్చేసిన పలు కీలక జిల్లాలు
ఒక్క జీహెచ్ఎంసి పరిధిలో తప్ప అధికార బిఆర్ఎస్ రాష్ట్రంలోని పలు కీలక జిలాల్లో చావు దెబ్బ తిన్నది. ఒకప్పుడు కెసిఆర్ పార్టీ ని తప్ప మరెవరిని గెలిపించడానికి ఆసక్తి చూపని జిల్లాలు..ఇప్పుడు అసలు కెసిఆర్ ని ...ఆ పార్టీ ఊసే లేకుండా చేసే ప్రయత్నం చేశారు అంటే అధికార పార్టీ పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికల ప్రచార సభల్లో అటు ధరణి తో పాటు...రైతులకు ఉచిత విద్యుత్ వంటి ఎన్నో అంశాలపై అటు సీఎం కెసిఆర్ దగ్గర నుంచి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు చేసినా కూడా ఆ పార్టీ కి ఎంతో పట్టున్న జిల్లాల ప్రజలు కూడా వీరి ప్రచారాన్ని ఏ మాత్రం నమ్మలేదు. బిఆర్ఎస్ కు ఓటు వేయండి...తెలంగాణ ను గెలిపించండి అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది ఆ పార్టీ . అసలు రాష్ట్రంలో తమకు తప్ప మరెవరికి రాజకీయ అధికారం దక్కకూడదు అన్నట్లు...తమకు తప్ప ఎవరికీ పరిపాలించటం చేత కాదు అన్నట్లు బిఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు వ్యవహరించారు. అయినా సరే తెలంగాణ ప్రజలు ఇవేమి పట్టించుకోకుండా మార్పు కోరుకుంటూ తెలంగాణ ఇచ్చిన పార్టీ గా కాంగ్రెస్ కు ఈ సారి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బాగా కలిసి వచ్చిన అంశం ఏమిటి అంటే సీఎం కెసిఆర్, ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ లపై ఉన్న వ్యతిరేకత...వాళ్ళ వ్యవహార శైలే అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది.
దీనికి తోడు పలు జిల్లాల్లో ఎమ్మెల్యే లు చేసిన భూ కబ్జాలు..ఇతర అరాచకాలు కూడా బిఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకతను పెంచటానికి కారణం అయ్యాయి అని చెప్పాలి. గత పదేళ్ల కాలంలో ఎక్కడ చూసినా కేవలం కెసిఆర్ ఫ్యామిలీ కి చెందిన వారు తప్ప..మంత్రులకు కూడా ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండా పోయిన విషయం తెలిసిందే. మరో వైపు ఏకంగా సీఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్యే కవిత ఢిల్లీ లిక్కర్ స్కాములో ఇరుక్కోవటం ఆ పార్టీని రాజకీయంగా బాగా డ్యామేజ్ చేసింది. ఈ కేసు నుంచి బయటపడేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నట్లు వచ్చిన విమర్శలు కూడా భారీగానే దెబ్బతీశాయి. వీటికి తోడు తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఎంతో సహకరించిన ఉద్యోగులు...ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవటం..నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవటం...పెద్ద ఎత్తున వచ్చిన అవినీతి ఆరోపణలు అన్నీ కలిసి బిఆర్ఎస్ అధికారానికి దూరం చేశాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. మొత్తం మీద ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ ను దాటడం పక్కా అని తేలిపోయింది.