ఇదేమి విచిత్రం..ఫేక్ లో ఫస్ట్ బిఆర్ఎస్!
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చూస్తుంటే ఫేక్ ప్రచారాలనే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో వరసగా ఆయనకు తగులుతున్న ఎదురుదెబ్బలు బిఆర్ఎస్ లో కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఐటి మంత్రిగా ఉండి...ఇలా చేయటం ద్వారా అయన భవిష్యత్ లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రేపు రేపు కీలక విషయాల్లో నిజాలు చెప్పినా కూడా కేటీఆర్ మాటలను ప్రతి ఒక్కరూ అనుమానించే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీ కె శివకుమార్ రాసినట్లు ఉన్న ఒక లేఖను మీడియా సాక్షిగా చూపుతూ మాట్లాడారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫాక్స్ కాన్ యూనిట్ ను తెలంగాణ నుంచి కర్ణాటకకు తరలిస్తారు అని ...సీఎం గా కెసిఆర్ ఉంటేనే ఇలాంటివి జరగవు అంటూ వ్యాఖ్యానించారు. సీన్ కట్ చేస్తే కేటీఆర్ చేసిన ప్రచారం...ఆ లేఖపై శివ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అది ఫేక్ లేఖ అని..తాను ఫాక్స్ కాన్ కు ఎలాంటి లెటర్ రాయలేదు అని...దీనిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్ఠి మరల్చేందుకే ఇలాంటి లేఖలు సృష్టిస్తున్నారు అని విమర్శించింది. సీన్ ఇక్కడ కట్ చేస్తే కొద్ది రోజుల క్రితం బిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ గుండాలె ఈ పని చేశారు అని...రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను టీపీసీసీ ప్రెసిడెంట్ చేస్తే ఇలాగే ఉంటుంది అని వరస ట్వీట్లు చేశారు. తర్వాత మంత్రి కేటీఆర్ చేసింది అంతా ఫేక్ ప్రచారం అని తేలింది.
ఈ ఘటనపై మీడియా తో మాట్లాడిన సిపీ సంచలనం కోసమే నిందితుడు రాజు ఈ పని చేశాడు అని ప్రకటించారు. అంతే తప్ప అతనికి ఎలాంటి రాజకీయ లింకు లు ఉన్నట్లు తేల్చలేదు ఇప్పటివరకూ. హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక వ్యవహారం రాష్ట్రంలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కేటీఆర్ ఒక ఛానల్ లో మాట్లాడుతూ ఆమె అసలు పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోలేదు అని తనకు సమాచారం వచ్చింది అని వెల్లడించారు. అంతే ఆ వెంటనే ఆమె హాల్ టికెట్స్ ను విద్యార్థులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అప్పుడు కూడా కేటీఆర్ ఇరకాటంలో పడినట్లు అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం బిఆర్ఎస్ కు ఏ మాత్రం అనుకూలంగా లేదనే వార్తలు వస్తున్న వేళ కేటీఆర్ రకరకాల విచిత్ర ప్రయోగాలు చేస్తున్నారు. ఒక వైపు రేడియో టాక్ షో లకు వెళ్ళటం తో పాటు మరో వైపు గంగవ్వ తో కలిసి మై విలేజ్ షో లో పాల్గొని కోడి కూర వండారు. డిజిటల్ ప్రచారం కోసం అధికార బిఆర్ఎస్ కోట్ల రూపాయల మేర ఖర్చు చేస్తోంది అని...దీనికి చాలా ముందు నుంచి ప్రణాళిక రచించినట్లు చెపుతున్నారు. అయితే వీటికి చెల్లింపులు అన్ని వివిధ మార్గాల్లో చేస్తున్నారు అని ఒక నేత వెల్లడించారు. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్ది ఇంకెన్ని ఫేక్ ప్రచారాలు..వార్తలు తెరమీదకు వస్తాయో వేచిచూడాల్సిందే. ఫేక్ ప్రచారం ఎవరు చేసినా తప్పే. సహజంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ లు ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇలాంటివి చేస్తుంటాయి. కానీ విచిత్రంగా తెలంగాణాలో అధికార పార్టీ ఫేక్ ప్రచారాల్లో ముందు ఉండటం చర్చనీయాంశంగా మారింది అనే చెప్పాలి.