Telugu Gateway
Telangana

ఇక అసలు రాజకీయ యుద్ధం స్టార్ట్

ఇక అసలు రాజకీయ యుద్ధం  స్టార్ట్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల డేట్స్ వచ్చాయి. రాష్ట్రంలో ఎన్నికలు నవంబర్ 30 న జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 3 న వెల్లడి కానున్నాయి. షెడ్యూల్ రాకతో ఇక అసలు రాజకీయ పోరు ప్రారంభం కానుంది. తెలంగాణాలో వరసగా మూడవసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని అధికార బిఆర్ఎస్ ప్రణాళికలు వేసుకుంటుంటే....ఈ సారి ఎలాగైనా తెలంగాణాలో అధికారంలోకి రావాలని...రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఇది తమకు ఎంతో కీలకంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మరో వైపు బీజేపీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అయితే కొద్ది నెలల క్రితం వరకు బీజేపీ లో ఉన్న జోష్ ఇప్పుడు మాయం అయింది అనే చెప్పాలి. తెలంగాణాలో పోటీ ప్రధానంగా అధికార బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉండే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. అయితే బిఆర్ఎస్ మాత్రం ఇప్పటికే అభ్యర్థలను ప్రకటించి ఈ విషయంలో ముందు ఉంది అనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మాత్రం కొద్ది రోజుల క్రితం అత్యంత కీలకమైన ఆరు హామీలు ప్రకటించి వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉంది. ఈ హామీలు అధికార పార్టీలో ఒకింత కలవరం రేపుతుండగా...వాటికి కౌంటర్ గా బిఆర్ఎస్ కూడా మరింత ఆకట్టుకునేలా హామీల రూపకల్పనలో ఉంది.

రెండు సార్లు అధికారంలో ఉండటం..వివిధ వర్గాల్లో అధికార పార్టీపై వ్యతిరేకత ఉండటంతో మూడవ సారి గెలుపు బిఆర్ఎస్ కు అంత ఆషామాషీ కాదు అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశాలు అధికారంలో ఉండటం...ఆర్థిక బలం ముఖ్యంశాలుగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ విషయానికి వస్తే ఇటీవలే పొరుగున ఉన్న కర్ణాటకలో ఆ పార్టీ మంచి విజయం దక్కించుకోవటంతో వచ్చిన సానుకూలత ..కీలక ఆరు హామీలు...బిఆర్ ఎస్ పై వ్యతిరేకత కాంగ్రెస్ గెలుపు అవకాశాలను మెరుగుపరుస్తోంది అనే అంచనాలు ఉన్నాయి. బీజేపీ కొద్ది నెలల క్రితం వరకు ఉన్న జోష్ కొనసాగి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది కానీ..ఒక్కసారిగా క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది అని..ఇది కాంగ్రెస్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. మరి ఈ త్రికోణ పోటీలో అంతిమ విజేతగా ఎవరు నిలుస్తారో డిసెంబర్ మూడున కానీ తేలదు. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం తెలంగాణతో పాటు మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించింది. ఇందులో తెలంగాణ తో పాటు మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్ గఢ్ ఉన్నాయి.

Next Story
Share it