ఆ పార్టీలకు తెలంగాణ ఓ రాజకీయ ప్రయోగశాల
అప్పుడు టీఆర్ఎస్..ఇప్పుడు బీజేపీ. ఈ రెండు పార్టీలకు తెలంగాణ ఓ రాజకీయ ప్రయోగశాలగా మారింది. ఉద్యమ సమయంలో తన రాజకీయ అవసరాల కోసం టీఆర్ఎస్ ప్రజలపై ఎన్నో ఉప ఎన్నికలు రుద్దింది. పార్లమెంట్ స్థానాలతో పాటు అసెంబ్లీ కి కూడా కేవలం రాజకీయ కారణాలతోనే ఉప ఎన్నికలు వచ్చాయి. అదే టీఆర్ఎస్ ఇప్పుడు మాత్రం అసలు తాము ఎప్పుడు ఉప ఎన్నికలకు కారణం కాలేదు అన్న చందంగా మాట్లాడుతోంది.మంగళవారం మునుగోడు లో రోడ్ షో నిర్వహించిన మంత్రి కెటీఆర్ అసలు తాము ఎప్పుడు ఉప ఎన్నికలు తేలేదు అన్న చందంగా మాట్లాడారు. ఉప ఎన్నిక అసలు ఎందుకు వస్తుంది..ఎవరైనా పైకి పోతే అంటూ..మునుగోడులో మాత్రం అమ్ముడు పోవటం వాళ్ళ వచ్చింది అంటూ విమర్శలు గుప్పించారు. నిజమే మునుగోడు ఉప ఎన్నిక ఏ మాత్రం అవసరం లేకుండా వచ్చిందే. ఇందులో మరో అభిప్రాయానికి తావు లేదు. టీఆర్ఎస్ అధికారంలోకి రాక ముందు...ఉద్యమ సమయంలో ఎప్పటికప్పుడు సెంటిమెంట్ చల్లారకుండా చేసుకోవటంతో పాటు..తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకొనే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి రాకముందే కాదు...వచ్చాక కూడా ..అవసరము లేక పోయినా కేవలం రాజకీయ లెక్కలతోనే గత టర్మ్ లో ఆరు నెలల ముందు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన విషయం అందరు చూశారు. ఇప్పుడు మాత్రం బీజేపీపై టీఆర్ఎస్ బలవంతపు ఎన్నికలు రుద్దింది అంటూ విమర్శలు చేస్తోంది. ఇదే పని వాళ్ళు ఎన్ని సార్లు చేశారు అన్న విషయాన్నీ మాత్రం చాలా కన్వీనెంట్ గా మర్చిపోతూ ఇతర పార్టీల పై మాత్రం విమర్శలు చేస్తున్నారు.
గతం లో టీఆర్ఎస్ ఏమి చేసిందో ఇప్పుడు బీజేపీ కూడా తన రాజకీయాల కోసమా ఉప ఎన్నికలను తీసుకువస్తోంది. మునుగోడు ఫలితం బీజేపీకి అనుకూలంగా వస్తే మాత్రం రాష్ట్రము లో మరిన్ని ఉప ఎన్నికలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. మరి ఫలితం ఎలా ఉంటది అన్నది తేలాలంటే నవంబర్ 6 వ తేదీ వరకు ఆగాల్సిందే. మొత్తానికి అప్పుడు టీఆర్ఎస్ కు..ఇప్పుడు బీజేపీ కి తెలంగాణ ఒక రాజకీయ ప్రయోగశాలగా మారింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏ పేరు చెప్పి రాజకీయంగా రెండు సార్లు భారీ ఎత్తున రాజకీయ ప్రయోజనాలు పొందిందో అదే టీఆర్ఎస్ ఇప్పుడు పార్టీలో తెలంగాణ పేరు కూడా లేకుండా చేసి...ఇప్పుడు బీఆర్ఎస్ అంటూ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయినా విషయం తెలిసింది. మరి బీఆర్ఎస్ కు మునుగోడు ఉప ఎన్నిక ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాలి. సీఎం కెసిఆర్ తన ప్రచారంలో కూడా మీకు అద్భుత అవకాశం వచ్చింది అంటూ చెప్పారు. మరి కెసిఆర్ పిలుపును మునుగోడు ఎలా తీసుకుంటుంది అన్నది త్వరలోనే తేలనుంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి నిజంగా నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజీనామా చేసి ఉంటే అదే పని కాంగ్రెస్ లో ఉండి కూడా చేయవచ్చు. కానీ ఇక్కడ లాభం లేదు కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరి ఆర్దికముగా లాభపడి ఆ పార్టీ కి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఇది అంతా చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ రాజకీయ ఆటలో అంతిమ విజేతలుగా ఎవరు నిలుస్తారో చూడాలి. ప్రజలకు మాత్రం ప్రతి సరి ఓటమే.