Telugu Gateway
Telangana

వివాద‌స్ప‌ద ట్వీట్...తీన్మార్ మల్ల‌న్నపై దాడి

వివాద‌స్ప‌ద ట్వీట్...తీన్మార్ మల్ల‌న్నపై దాడి
X

తీన్మార్ మ‌ల్ల‌న్న వ్య‌వ‌హారం తెలంగాణ‌లో దుమారం రేపుతోంది. తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ కొడుకు హిమాన్షు ను ఉద్దేశించి తీన్మార్ మ‌ల్ల‌న్న చేసిన ట్వీట్ రాజ‌కీయ దుమారానికి కార‌ణం అయింది. దీనిపై మంత్రి కెటీఆర్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. బిజెపి అగ్ర‌నేత‌లు తెలంగాణ‌లోని వాళ్ల‌కు ఇలాంటి సంస్కార‌మే నేర్పుతున్నారా అంటూ మ‌ల్ల‌న్న ట్వీట్ ను కెటీఆర్ బిజెపి జాతీయ నేత‌ల‌కు ట్యాగ్ చేశారు. తాము కూడా ఇదే త‌ర‌హాలో ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా కుటుంబ స‌భ్యుల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించ‌వ‌చ్చా అంటూ ప్ర‌శ్నించారు. చ‌ట్ట‌ప‌రంగా తాము చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా హెచ్చ‌రించారు. ఇది జ‌రిగిన కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై దాడి జ‌రిగింది.

కేటీఆర్‌ కొడుకు హిమాన్షుపై ట్విటర్‌లో పెట్టిన పోస్టుకు కోపంతో ఊగిపోయిన కొంతమంది టీఆర్‌ఎస్‌ సానుభూతిపరులు తీన్మార్‌ మల్లన్నపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బోడుప్పల్‌ పరిధిలోని లక్ష్మీనగర్‌ కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు.. బోడుప్పల్‌లోని శనార్థి తెలంగాణ పత్రికా కార్యాలయంలో ఉన్న తీన్మార్‌ మల్లన్న వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగి ఆయనపై దాడి చేశారని రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి వెల్లడించారు. అయితే అభివృద్ది ఎక్కడ జరిగింది? భద్రాచలం గుడిలోనా.. హిమాన్షు శరీరంలోనా అనే అర్థం వచ్చేలాగా ట్విటర్‌లో పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై ఆగ్రహించిన వ్యక్తులు దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు.

ఇదే ట్వీట్ పై కెటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ రాజ‌కీయ నేత‌ల కుటుంబ స‌భ్యుల‌ను బాడీ షేమింగ్ చేస్తూ ఇంత నీచానికి దిగజారుతారా అని ప్ర‌శ్నించారు. జర్న‌లిజం ముసుగులో..భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్చ పేరుతో కొంత మంది ఇష్టానుసారం చేస్తున్నార‌ని మండిపడ్డారు కెటీఆర్. ఇదిలా ఉంటే మ‌ల్ల‌న్న ట్వీట్ ను వైఎస్ ఆర్ టీపీ నాయ‌కురాలు వైఎస్ ష‌ర్మిల ఖండించారు. ''పిల్లలకు ఒక తల్లిగా, రాజకీయ పార్టీ నేతగా రాజకీయాల్లోకి గుంజడాన్ని ఖండిస్తున్నా. కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటనలను సహించేది లేదు. మహిళలను కించపరిచినా, పిల్లలను కించపరిచినా.. మనం రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలి'' అని షర్మిల ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story
Share it