సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ

దేశంలోనే అతి పెద్ద ఏఐ డేటా సెంటర్ కు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ డేటా సెంటర్ ను దిగ్గజ ఐటి కంపెనీ టిసిఎస్ కు చెందిన అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులు శనివారం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశం అయ్యారు. అదే సమయంలో అవగాహనా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ డేటా సెంటర్ కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో 250 ఎకరాలను కేటాయించనుంది. 1 గిగావాట్ సామర్థ్యంతో టీసీఎస్, హైపర్‌వాల్ట్, భాగస్వామ్య సంస్థలు కలిపి ఈ ప్రాజెక్టులో రూ.70 వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నాయి. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. టీసీఎస్ ప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ టాటా ప్రాజెక్టుతో తన కల నిజమైందని అన్నారు.
ఇంత పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ తెలంగాణకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణకు ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్‌ను దావోస్‌లో కలిసి పెట్టుబడులు పెట్టాలని తాము కోరామని తెలిపారు. త్వరలోనే కొంగరకలాన్ ఫ్యూచర్ సిటీకి రేడియల్ రోడ్డు వేస్తామని అన్నారు. ఆ రేడియల్ రోడ్డును భారతరత్న రతన్ టాటాకు అంకితం చేస్తామని తెలిపారు. 2028 జూన్ 2వ తేదీన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆ దిశగా టాటా సంస్థ కూడా ప్రయత్నాలు చేయాలని సూచించారు. టాటాకు అవసరమైన అన్ని సదుపాయాలు, అనుమతులు కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.



