Telugu Gateway
Telangana

టార్గెట్ టీఆర్ఎస్..డ్యూటీ ఎక్కిన ఐటి..సీబీఐ..ఈడీ!

టార్గెట్ టీఆర్ఎస్..డ్యూటీ ఎక్కిన ఐటి..సీబీఐ..ఈడీ!
X

తెలంగాణ‌లో కేంద్ర ఏజెన్సీలు డ్యూటీ ఎక్కాయి. అధికార టీఆర్ఎస్ టార్గెట్ గా అంతా సాగుతున్న‌ట్లు స్పష్టం అవుతోంది. లిక్క‌ర్ స్కామ్ లో సీఎం కెసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌విత పేరు తెర‌పైకి రావ‌ట‌మే పెద్ద సంచ‌ల‌నం. ఇది అంతా ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే బిజెపి చేస్తుంద‌ని చెబుతున్నారు. ఈ స్కామ్ తో త‌న‌కు ఏ మాత్రం సంబంధం లేద‌ని ఖండించిన క‌విత ఏ విచార‌ణ అయినా జ‌రుపుకోవ‌చ్చ‌న్నారు. అయితే బిజెపి నేత‌లు మాత్రం లిక్క‌ర్ స్కామ్ లో క‌విత పాత్ర‌పై సీబీఐ విచార‌ణ సాగుతోంద‌ని..త్వ‌ర‌లోనే అన్ని విష‌యాల బ‌య‌టికి వ‌స్తాయ‌ని చెబుతున్నారు. క‌విత పేరు ఈ స్కామ్ లో తెర‌పైకి రావ‌టంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద సంచ‌ల‌న‌మే అని చెప్పుకోవ‌చ్చు. ఇప్ప‌టికే ఓ మంత్రి టార్గెట్ గా వాస‌వి, సుమ‌ధుర గ్రూపుల్లో ఐటి దాడులు జ‌రిగాయి. వీటికి కొన‌సాగింపుగానే మంగ‌ళ‌వారం నాడు ఫీనిక్స్ లోనూ ఐటి దాడులు ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించిన ప‌క్కా ఆధారాలు సేక‌రించిన త‌ర్వాత ఆ కీలక నేత‌, మంత్రి పేరు కూడా బ‌హిర్గ‌తం అవుతుంద‌ని..అప్పుడు రాజ‌కీయం మ‌రింత రంజుగా మారుతుంద‌ని చెబుతున్నారు. తాజా ఐటి దాడులు అన్నీ కూడా ప‌క్కా స‌మాచారం ఆధారంగానే సాగుతున్న‌ట్లు చెబుతున్నారు.

వచ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా తెలంగాణాలో అధికారం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్న బిజెపి అందుకు అనుగుణంగానే ప్లాన్స్ రెడీ చేసుకున్న‌ట్లు స‌మాచారం. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అవినీతిలో కూరుకుపోయింద‌ని..అమ‌రుల త్యాగాల‌తో వ‌చ్చిన రాష్ట్రంలో దోపిడీ సాగుతోంద‌ని చూపించాల‌నేది బిజెపి ప్లాన్. ఈ దిశ‌గానే ప్ర‌స్తుతం అన్నీ సాగుతున్నాయి. ఇప్ప‌టికే బిజెపితో పాటు కాంగ్రెస్ నేత‌లు కూడా కాళేశ్వ‌రం ద‌గ్గ‌ర నుంచి ప‌లు ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జ‌రిగింద‌ని ఆరోపిస్తున్నారు. లిక్క‌ర్ స్కామ్, ఐటి దాడులు కేవ‌లం శాంపిల్ మాత్ర‌మేన‌ని..రాబోయే రోజుల్లో అస‌లు సినిమా ఉంద‌ని చెబుతున్నారు. సీఎం కెసీఆర్ త‌ర‌హాలోనే ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా కాలుదువ్వారు. కానీ మంత్రి పార్ధా చ‌ట‌ర్టీ స‌న్నిహితురాలి ఇంట్లో కోట్లాది రూపాయ‌ల న‌గ‌దు ప‌ట్టుకోవ‌టంతో ఇప్పుడు మ‌మ‌తా బెన‌ర్జీ నోరెత్త‌లేని ప‌రిస్థితి. మ‌రి ఈ టార్గెట్ టీఆర్ఎస్ వ్య‌వ‌హారంలో ఎన్ని సంచ‌ల‌నాలు న‌మోదు అవుతాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it