Telugu Gateway
Telangana

ఈ ఎజెండా ఎవరిది...అమలు చేస్తున్నది ఎవరు?!

ఈ ఎజెండా ఎవరిది...అమలు చేస్తున్నది ఎవరు?!
X

తెలంగాణ లో ఒక వైపు కాంగ్రెస్ పార్టీ కి సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత మెరుగయ్యే సూచనలు ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ లో సాగుతున్న లొల్లి కాంగ్రెస్ కు మరింత పాజిటివ్ గా మారుతోంది. ఈ తరుణంలో తెర వెనక ఎవరి కుట్రలకు వాళ్ళు తెర తీస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం వార్నింగ్ తో ఎన్నికల ముందు కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య ఉన్న అంతర్గత కలహాలు ప్రస్తుతం పూర్తిగా సద్దుమణిగినట్లు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వ్యవహారం అంతా ఒక ఎజెండా ప్రకారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా కూడా ముఖ్యమంత్రి పీఠం ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి కి దక్కకూడదు అన్నది వాళ్ళ ప్లాన్. ఎలాగూ కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికల ముందు ఎవరి పేరును ప్రకటించే ఛాన్స్ లేదు. ఈ తరుణంలో వ్యూహాత్మకంగా సిఎల్ పీ నేత మల్లు భట్టి విక్రమార్క కు ఇస్తున్న ఎలివేషన్స్ చూసి కాంగ్రెస్ పార్టీ లోని నాయకులే అవాక్కు అయ్యే పరిస్థితి ఉంది అనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు కొంత మంది మల్లు భట్టి విక్రమార్క ను ఇప్పటికే దివంగత రాజశేఖర్ రెడ్డి తో పోలుస్తున్నారు. తెలంగాణాలో ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉండే ఒక ఛానల్ సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కు ఇచ్చిన ఎలివేషన్ చూసిన వాళ్ళు ఇంకా షాక్ లో ఉన్నారనే చెప్పాలి. దేశంలోని దిగ్గజ రాజకీయ నాయకులకు మల్లు భట్టి విక్రమార్క ఏ మాత్రం తీసిపోరు అనే చందంగా సాగిన ఆ స్టోరీ వెనక చాలా పెద్ద కథ ఉంది అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా పీసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై ఉన్న వ్యతరేకత కొంత అయినా తగ్గించేందుకు అన్నట్లు మల్లు భట్టి విక్రమార్క పాద యాత్రకు ప్రాధాన్యత ఇస్తూ పోయింది.

ఇదే మల్లు భట్టి విక్రమార్క పార్టీ లైన్ కు బిన్నంగా కెసిఆర్ సర్కారు అరకొరగా ఇస్తున్నా దళిత బంధు ను సమర్ధించటం...శాసన సభలో మల్లు భట్టి విక్రమార్కపై అటు సీఎం కెసిఆర్, ఇటు కెటిఆర్ లు ప్రశంసలు కురిపిస్తూ పార్టీ గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. పీసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి ని ఎలాగైనా దెబ్బ కొట్టేలా తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మల్లు భట్టి విక్రమార్క కు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తున్నారు అనే చర్చ కాంగ్రెస్ పార్టీ నేతల్లో సాగుతోంది. అయినా సరే ఇప్పుడు ఎవరు కూడా బయటపడి దీనిపై మాట్లాడటానికి సిద్ధంగా లేరు అనే చెప్పాలి. అంతే కాదు స్వయంగా పీసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా భట్టి పాదయాత్రలో వచ్చిన అంశాలను పార్టీ మేనిఫెస్టో లో పెడతామని స్వయంగా ప్రకటించారు. అయితే ఇది అంతా ఒక కీలక నేత ఎజెండా ప్రకారమే సాగుతుంది అని...పార్టీ ఏది అయినా ఆడించేది అంతా ఒక్క చోట నుంచే అని చెపుతున్నారు. అయితే ఈ పరిణామాలు అన్నిటిని పీసిసి ప్రెసిడెంట్ రేవంత్ వర్గం కూడా ఒక కంట కనిపెడుతూ ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా ముందుకు సాగుతోంది. చూడాలి తెర వెనక నుంచి కాంగ్రెస్ ను కూడా ఆడిస్తున్న ఆ శక్తుల కుట్రలు ఎంత మేర వర్క్ అవుట్ అవుతాయో.

Next Story
Share it