Telugu Gateway
Telangana

ముగ్గురు కీలక నేతల రాజకీయ ప్రయోగం

ముగ్గురు కీలక నేతల రాజకీయ ప్రయోగం
X

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం. ముగ్గురు కీలక నేతలు ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండటం ఆసక్తికర పరిణామంగానే చెప్పుకోవాలి. తొలుత బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పోటీ చేసే రెండవ నియోజకవర్గం గురించి లీకులు ఇచ్చారు...కామారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పలు మార్లు కోరటంతో కెసిఆర్ ఇందుకు ఒప్పుకున్నారు అని ప్రచారం చేశారు. తర్వాత విచిత్రంగా సీఎం కెసిఆర్ స్వయంగా మీడియా సమావేశంలో తాను రెండు చోట్ల పోటీ చేయాలని పార్టీ డిసైడ్ చేసింది అని చెప్పి అందరిని షాక్ కు గురి చేశారు. తర్వాత కామారెడ్డి అభివృద్ధి కోసమే కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ రకరకాల ప్రచారాలు తెరపైకి తెచ్చారు. కారణాలు ఏమైనా కెసిఆర్ రెండు నియోజకవర్గాలు అంటే అటు గజ్వేల్, ఇటు కామారెడ్డిలో బరిలోకి దిగటం అన్నది తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుంది అనే అభిప్రాయం కొంత మంది బిఆర్ఎస్ నేతలు కూడా వ్యక్తం చేశారు. అయితే రెండు చోట్ల బరిలోకి దిగుతున్న కెసిఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహాలతో ప్రతిపక్షాలు సిద్ధం కావటంతో ఈ మొత్తం వ్యవహారం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అసలు అసెంబ్లీ బరిలో లేకపోవటం విచిత్రం అయితే...మాజీ మంత్రి...బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాత్రం బీజేపీ తరపున గజ్వేల్ లో కెసిఆర్ పై పోటీ చేస్తూనే ..తన సొంత నియోజకవర్గం హుజురాబాద్ నుంచి కూడా బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాక ముందే ఈటల తాను కెసిఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగానే బీజేపీ అధిష్టానం ఈటల ను రెండు చోట్ల పోటీకి దింపింది.

ఇది ఒకటి అయితే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎవరూ ఊహించని రీతిలో కెసిఆర్ బరిలోకి దిగుతున్న రెండవ నియోజకవర్గం కామారెడ్డి రేస్ లోకి దిగారు. అయన కొడంగల్ తో పాటు కామారెడ్డి బరిలో ఉండబోతున్నారు. సోమవారం రాత్రి కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన జాబితాలో కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పేరు ను ప్రకటించారు. దీంతో అటు కెసిఆర్ దగ్గర నుంచి ఇటు రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ లు రెండేసి చోట్ల నుంచి బరిలోకి దిగటం ఇదే మొదటి సారి. తాజా పరిణామాలతో తెలంగాణ రాష్ట్రం అంతటా ఒకటి....గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరొకటి అన్న చందంగా పరిస్థితి వచ్చింది. గజ్వేల్ లో ఓటమి భయంతో కెసిఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు అని కాంగ్రెస్, బీజేపీ లు ప్రచారం తెర మీదకు తీసుకు వచ్చాయి. కామారెడ్డి లో రేవంత్ రెడ్డి పోటీ కేవలం బిఆర్ఎస్ అదినేత, సీఎం కెసిఆర్ ను ఇరుకున పెట్టడానికి తప్ప మరొకటి కాదు అని చెప్పొచ్చు. ఈటల లక్ష్యం కూడా అదే.ఏ ఒక్క చోట ఏ కారణంతో అయినా కెసిఆర్ పరాజయం పలు అయితే అది తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనమే అవుతుంది.

Next Story
Share it