తెలంగాణ సర్కారు తీరుపై గవర్నర్ అసంతృప్తి
కీలక పరిణామం. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న తరుణంలో సర్కారు తీరుపై గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది రాజకీయ దుమారం రేపటం ఖాయంగా కన్పిస్తోంది. నిబంధనల ప్రకారమే ఇలా చేశామని బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ను ఆహ్వానిస్తేనే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని కొద్ది రోజుల క్రితం తెలంగాణ శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి హరీష్ రావులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అందుకు భిన్నంగా గవర్నర్ ఓ ప్రకటన ద్వారా ఈ అంశంపై స్పందించటం ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ ప్రసంగం లేకుండానే సభ నిర్వహించాలన్న ప్రస్తుత ప్రభుత్వ పనితీరును పరిశీలించాలని ప్రజలకు సూచించారు. గవర్నర్ ప్రసంగం లేకుండా చేస్తే సభ్యులు చర్చించే హక్కును కోల్పోయినట్టేనని అన్నారు.
సాంకేతికంగా గవర్నర్ ప్రసంగం తప్పనిసరి కాకపోవచ్చని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం లేకపోయినప్పటికీ బడ్జెట్ సమర్పణను స్వాగతిస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం శనివారం ఓ పత్రిక ప్రకటన విడుడల చేసింది. ఆర్దిక బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిఫారసు కోరిందని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అందుకు ఓకే చెప్పినట్లు వెల్లడించారు. ఆర్ధిక బిల్లు సిఫారసుకు సమయం తీసుకునే స్వేచ్చ తనకు ఉందని..అయినా ప్రజా శ్రేయస్సు ను పరిగణనలోకి తీసుకుని ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. సంప్రదాయం ప్రకారం బడ్జెట్ సమావేశాలు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం అవుతాయి. అయితే ఈ సమావేశాలు గత సభకు కొనసాగింపుగానే సాగుతున్నందున సాంకేతిక అంశాలను చూపించిన సర్కారు గవర్నర్ ప్రసంగం లేకుండా చేసింది. దీనిపై కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్, బిజెపిలు స్పందించాయి.