Telugu Gateway
Telangana

చేసింది చెప్పి ఓట్లు అడుగుతాం

చేసింది చెప్పి ఓట్లు అడుగుతాం
X

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము చేసింది చెప్పే ఓట్లు అడుగుతామని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. గత అరవై ఏళ్ళలో ఎన్నడూ జరగని అభివృద్ధి టీఆర్ఎస్ పాలనలోనే జరిగిందని అన్నారు. అసలు బిజెపికి పోటీ చేసేందుకు అభ్యర్ధులు ఉన్నారా? అని తలసాని ప్రశ్నించారు. గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లే తమకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మేయర్ అభ్యర్ధిపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అభ్యర్ధుల ఎంపిక పూర్తి అయిన తర్వాత దీనిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. జీహెచ్ఎంసీ నిధులే కాకుండా నగరంలో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం కూడా నిధులు కేటాయించిందని తెలిపారు. దేశమంతా కరోనా సమయంలో ఇబ్బందులు పడుతుంటే హైదరాబాద్ లో మాత్రం రహదారుల అభివృద్ధి, అండర్ పాస్ లు, ఫ్లైఓవర్లు పూర్తి చేశామని తెలిపారు.

అధికార టీఆర్ఎస్ గెలిస్తేనే హైదరాబాద్ లో మరింత అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. బిజెపి అసలు ఏమి చెప్పి ఈ ఎన్నికల్లో పోటీచేస్తుందని ప్రశ్నించారు. మాట్లాడితే మతాల గురించి ప్రస్తావించటం తప్ప..అభివృద్ధి గురించి అసలు బిజెపి ప్రస్తావిస్తుందా? అన్నారు. టీఆర్ఎస్ పాలనలో కర్ఫ్యూ కానీ, మత కల్లోలాలు ఎప్పుడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీని ఎవరూ అందుకోలేరని అన్నారు. ఎన్నడూలేని రీతిలో వరదలు హైదరాబాద్ ను ముంచెత్తితే ముందు ఉండి సాయం చేసింది టీఆర్ఎస్ తప్ప మరెవరూ కాదన్నారు. కేంద్రానికి నివేదికలు పంపినా ఇంత వరకూ సాయం చేసింది ఏమీలేదన్నారు.

Next Story
Share it