ఇన్నోవేషన్ ...ఇన్వెస్ట్ మెంట్స్ టార్గెట్
ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలను కల్పించేందుకు టీ కన్సల్ట్ చైర్మన్ సందీప్ మఖ్తల, పిలిప్పిన్స్ రాణి మారియ లియోనారా టోరెస్ సంయుక్త కార్యాచరణ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులకు మేలు చేసేందుకు టీ కన్సల్ట్ ద్వారా రాయల్ అలయన్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ గుర్తింపు పొందిన టీ హబ్ వేదికగా ఈ మేరకు అంగీకారం పత్రం(ఎంఓయూ) మార్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాచరిక కుటుంబాలచే సుస్థిర అభివృద్ధి కోసం ఔత్సాహికులకు ప్రోత్సహించేందుకు వినూత్న అవకాశాలను ఆవిష్కరించడం, ఇన్వెస్ట్‌మెంట్ సహాయం అందించడం ఈ రాయల్ అలయన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం. టెక్నాలజీ ఆధారంగా సమాజంలో సానుకూల పురోగామి మార్పులు తీసుకురావడం లక్ష్యంగా, ఈ ప్రక్రియను వేగవంతంగా ముందుకు పోయేందుకు కావాల్సిన తోడ్పాటును అందించడం ఉద్దేశంగా ఈ ఒప్పందం ద్వారా టీ కన్సల్ట్ చైర్మన్ సందీప్ మఖ్తల మరియు పిలిప్పిన్స్ రాణి మారియ లియోనారా టోరెస్ ముందుకు సాగనున్నారు.
టీ కన్సల్ట్ రాయల్ అలయన్స్ ద్వారా చేపట్టే గ్లోబల్ ఇన్నోవేషన్ & ఇన్వెస్ట్మెంట్ కార్యాచరణలో భాగంగా రాచరిక కుటుంబాలను, ప్రభుత్వాలను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను కటింగ్ ఎడ్జ్ టెక్నలజీ ఇన్నోవేషన్ల ద్వారా అనుసంధానం చేసి, ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పలు సవాళ్లను ఎదుర్కునే రీతిలో ముందుకు సాగుతారు. ఈ ఒప్పందం ద్వారా, పెద్ద ఎత్తున అవకాశం ఉన్న పెట్టుబడులను సమీకరించి సృజనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటుగా సామాజిక సమస్యలకు పరిష్కారానికి కృషి చేస్తుంది. తద్వారా ఆర్థిక పురోగామి వృద్ధికి పాటుపడుతుంది. ముఖ్యంగా, విద్య, వైద్యం, సుస్థిరాభివృద్ధి మరియు సాంకేతిక రంగాల్లో ఈ రాయల్ అలయన్స్ ప్రోగ్రాం తన కార్యాచరణను చేపడుతుంది. ఇన్నోవేషన్ రంగంలో అంతర్జాతీయంగా గుర్తింపును సొంతం చేసుకున్న టీ హబ్ వేదికగా కుదిరిన ఈ రాయల్ అలయన్స్ యొక్క మొదటి ఒప్పందం తదుపరి దశలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజవంశస్తుల యొక్క సహాయ సహకారాలతో ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్ల అంశాలలో సామాజిక ప్రభావం లక్ష్యంగా కృషి చేయనుంది.
సామాజికంగా ఎదురవుతున్న సవాళ్లు, ఈ రంగంలో ఆవిష్కరణలకు ఉన్న వెసులుబాట్లు మరియు ఎదురయ్యే సవాళ్లు - పరిష్కారాలు, పెట్టుబడికి ఉన్న అవకాశాలు మరియు సామాజికంగా కలిగే ప్రయోజనాలపై రాయల్ అలయన్స్ కృషి చేస్తుంది. పిలిప్పిన్స్ రాణి క్వీన్ మారియా లియోనారా టోరెస్ మొదటి ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా మరిన్ని రాజవంశాలు ఈ వేదికతో కలిసి నడిచేందుకు అవకాశం ఉంది. ఈ ఒప్పందం సందర్భంగా టీ కన్సల్ట్ చైర్మన్ సందీప్ మఖ్తల మాట్లాడుతూ, ` రాయల్ అలయన్స్ ద్వారా సంయుక్త కార్యాచరణతో ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టే ప్రక్రియకు మొదటగా ముందుకు వచ్చిన పిలిప్పిన్స్ రాణి మారియ లియోనారా టోరెస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజే్తున్నాం. విశ్వవ్యాప్తంగా ఇన్నోవేషన్లు మరియు ఇన్వెస్ట్‌మెంట్ల అంశంలో కృషి చేసే ప్రక్రియలో ప్రస్తుతం కుదిరిన ఎంఓయూను తొలి అడుగుగా భావించవచ్చు మరియు ఈ ప్రక్రియ విశేష రీతిలో ముందుకు సాగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే అనేక సంక్లిష్ట సమస్యలకు రాచరిక కుటుంబాల యొక్క సహకారం, సమన్వయంతో ఒక నెట్ వర్క్ ఏర్పాటు చేసి ముందుకు సాగే దిశగా మా విజన్ ఉండనుంది` అని తెలియజేశారు.