Telugu Gateway
Telangana

ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్ చ‌లో రాజ్ భ‌వ‌న్

ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్ చ‌లో రాజ్ భ‌వ‌న్
X

తెలంగాణ కాంగ్రెస్ త‌ల‌పెట్టిన చ‌లో రాజ్ భ‌వ‌న్ కార్య‌క్ర‌మం ఉద్రిక్తంగా మారింది. దీంతో చివ‌ర‌కు పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీల‌కు ఈడీ నోటీసులు ఇవ్వ‌టాన్ని వ్య‌తిరేకిస్తూ కాంగ్రెస్ గ‌త మూడు రోజులుగా ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే గురువారం నాడు చ‌లో రాజ్ భ‌వ‌న్ కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్‌కు చేరుకోవ‌టంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. పోలీసులను కూడా భారీ సంఖ్య‌లో అక్క‌డ మొహరించారు. కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.ఖైరతాబాద్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ శ్రేణులు బైక్‌కు నిప్పుపెట్టి నిరసనకు దిగారు. బస్సుల రాకపోకలను కూడా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సుల‌ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల ఆంక్షలను ధిక్కరించి కాంగ్రెస్‌ నేతలు రాజ్‌భవన్‌ వైపు దూసుకెళ్లారు. దీంతో రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ సహా పలువురు నేతల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌ తలపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే క్రమంలో పోలీసులు రేణుకాచౌదరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమెకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రేణుకా చౌదరి పోలీసు అధికారి కాలర్‌ పట్టుకున్నారు. అయితే పోలీసులు ఆమెను బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బ‌స్సుల‌పైకి ఎక్కి కేంద్రానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించే క్ర‌మంలో తీవ్రంగా తోపులాట జ‌రిగింది. రేవంత్ అరెస్ట్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్ర‌య‌త్నించ‌టమే దీనికి కార‌ణం. కాంగ్రెస్ నిర‌స‌న‌ల‌తో ఖైర‌తాబాద్ తోపాటు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.

Next Story
Share it