హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి ఇదే లాస్ట్ ఛాన్స్
హైదరాబాద్ లో ప్రతి ఏటా అట్టహాసంగా నిర్వహించే ప్రతిష్టాత్మక వినాయక నిమజ్జనానికి అడ్డంకులు తొలగాయి. అయితే ఇది ఈ ఒక్కసారికి మాత్రమే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల19న జరిగే నిమజ్జనానికి మాత్రం అనుమతి మంజూరు చేసింది. తెలంగాణ హైకోర్టు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహల నిమజ్జనానికి అనుమతించే ప్రశ్నేలేదని స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ జడ్జి ఆదేశాలపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం రాలేదు. దీంతో సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ పిటీషన్ ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ దర్మాసనం దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ లో ఈ సమస్య కొత్తగా వచ్చింది కాదని..ఎన్నో ఏళ్ళ నుంచి ఉందన్నారు. నిమజ్జనం విషయంలో ప్రభుత్వ తీరు సరిగాలేదన్నారు. . హుస్సేన్ సాగర్ పరిశుభ్రపరిచేందుకు, సుందరీకరణకు ప్రతి ఏడాది నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు.
ప్రతి సంవత్సరం విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా నిధులు వృథా అవ్వడం లేదా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.జీహెచ్‌ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఉత్సవాలు జరుగుతున్న సమయంలో హైకోర్టు ఆర్డర్ వచ్చిందని సోలిసిటర్ జనరల్ అన్నారు. విగ్రహాలు చాలా వరకు ఎత్తుగా ఉన్నాయని, అకస్మాత్తుగా ఉత్తర్వులను అమలు చేయడంతో అనేక ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఈ ఆర్డర్‌ను అమలు చేస్తామని తుషార్ మెహతా తెలిపారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ క్రేన్‌లు ఏర్పాటు చేశామని కాలుష్యం జరగకుండా వెంట వెంటనే విగ్రహాలను తరలిస్తామని సోలిసిటర్ జనరల్ వివరించారు.