Telugu Gateway
Telangana

రష్ తో శంషాబాద్ ఎయిర్ పోర్టు ఉక్కిరిబిక్కిరి

రష్ తో శంషాబాద్ ఎయిర్ పోర్టు ఉక్కిరిబిక్కిరి
X

వినటానికి విచిత్రంగా ఉన్నా హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. ఈ పరిస్థితి చూసి విమానాశ్రయ నిర్వహణ సంస్థ జీఎంఆర్ కూడా టెన్షన్ కు గురవుతోంది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఉన్నత విద్యను అభ్యసించటానికి విద్యార్థులు పెద్ద ఎత్తున విదేశాలకు బయలు దేరి వెళుతున్నారు. ఇది విద్యార్థుల సీజన్. సమస్యంతా కూడా అక్కడే వచ్చిపడింది. విదేశాలకు వెళ్లే తన ఫ్రెండ్ ను కలవటానికి..సెండ్ ఆఫ్ ఇవ్వటానికి ఒక్కో విద్యార్థికి సంబంధించి 50 నుంచి 60 మంది సందర్శకులు ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటున్నారు. ఈ దెబ్బకు అక్కడ కారు పార్కింగ్ ప్లేస్ తో పాటు ఎయిర్ పోర్ట్ రోడ్లు , ర్యాంప్ లు కిక్కిరిసిపోతున్నాయి.

ఇది ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది అని జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ఒక ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేసింది. అటు విద్యార్థులు తో పాటు ఇతర ప్రయాణికుల జర్నీ సాఫీగా సాగేందుకు విమానాశ్రయ సిబ్బందికి సహకరించాలని..సందర్శకులు పెద్ద ఎత్తున రావొద్దు అంటూ కోరింది. అదే సమయంలో కార్ల విషయంలో కూడా నియంత్రణ పాటించాలని సూచించారు. దీంతో పాటు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ఇప్పటికే విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా దేశీయ విమాన ప్రయాణికులతో పాటు విదేశీ ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దీనికి తోడు విద్యార్థుల రష్ కూడా తోడు అవటంతో ఇప్పుడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కిటకిట లాడుతోంది.

Next Story
Share it