హైదరాబాద్ కు మరో 60 వేల స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు
రష్యా కు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు హైదరాబాద్ కు మరో 60 వేలు వచ్చాయి. ప్రత్యేక విమానంలో ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయంలో ఈ వ్యాక్సిన్లు దిగాయి. ఇప్పటికే తొలి దశలో లక్షన్నర వ్యాక్సిన్లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ల సమర్ధత కూడా ఎంతో మెరుగ్గా ఉన్నట్లు నివేదికలు తేల్చాయి. తాజాగా హైదరాబాద్ లో ఈ వ్యాక్సిన్ డోసులు ఇవ్వటం కూడా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు భారత్ కు రానున్నాయి. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ దేశంలో ఈ వ్యాక్సిన్ల సరఫరా, తయారీకి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
బారత్ కు కొత్తగా వ్యాక్సిన్లు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని దేశంలో రష్యా రాయభారి నికోలాయ్ కుడషేవ్ మాట్లాడుతూ కరోనా పోరులో రెండు దేశాల మధ్య ద్వేపాక్షిక సహకారం పటిష్టంగా ముందుకు సాగుతుందన్నారు. రష్యాలో ఈ వ్యాక్సిన్ ఎప్పటి నుంచో వినియోగంలో ఉంది. కొత్తగా వెలుగుచూసిన కొత్త వేరియంట్లపైన కూడా స్పుత్నిక్ వి మెరుగ్గా పనిచేస్తోందని చెబుతున్నారు. స్పుత్నిక్ వి వాడకానికి అందుబాటులోకి రావటంతో దేశంలో ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నట్లు అయింది.