తాగునీటి సమస్య పరిష్కరించాం..3866 కోట్లతో సీనరేజ్ ప్లాంట్లు
హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలని అందుకు మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ తెలిపారు. నగరంలో తాగునీటికి సమస్య లేకుండా చేశామన్నారు. తాగునీటి సమస్య 90 శాతం పూర్తి చేయడంతోపాటు విద్యుత్ ఇబ్బందులు కూడా లేకుండా చేసి అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ శాఖపై మంత్రి కేటీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. మురుగు నీటి శుద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
పదేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీవరేజ్ ప్లాంట్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీవరేజ్ ప్లాంట్ల నిర్మాణానికి .3,866.21 కోట్ల రూపాయలు మంత్రివర్గం కేటాయించిందని వెల్లడించారు. నగరంలో కొత్తగా 2 లక్షల వాటర్ కనెక్షన్లు ఇవ్వబోతున్నట్లు కేటీఆర్ తెలిపారు. నగరంలో 20 శాతంపైగా నీటిని రీయూస్ చేస్తున్నట్లు వెల్లడించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో స్కై వేలు నిర్మించడానికి అనుమతికి ఏడేళ్లుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రూ.1,200 కోట్లతో 137 ఎంఎల్‌డీ కెపాసిటీతో రిజర్వాయర్లు నిర్మించడానికి ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మురుగునీటి శుద్ది, తిరిగి ఉపయోగించడానికి కాలుష్య నియంత్రణ బోర్డ్, వాటర్ బోర్డ్ తో కలిసి కొత్త పాలసీని తెస్తామని కేటీఆర్ తెలిపారు.