కెటీఆర్ తో సోనూసూద్ భేటీ
కరోనాకు ముందు సోనూసూద్ ఓ నటుడిగా..సినిమా విలన్ గానే అందరికీ తెలుసు. కానీ కరోనా విలయ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో సేవా కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా సోనూసూద్ ఒక్కసారిగా జాతీయ స్థాయి గుర్తింపును దక్కించుకున్నారు. వ్యక్తిగతంగా సాయం అందించటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సాయం కోరిన సందర్భాల్లో కూడా ఆయన ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సాయం అందిస్తామని ప్రకటించి..వాటిని చేసి చూపించారు కూడా. తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ తో సమావేశం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో వైద్య మౌలికసదుపాయాలను వికేంద్రీకరణ చేయాల్సిన అంశంపై మాట్లాడినట్లు సమాచారం.
ఈ సంద్భరంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలలనుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తు సోను సూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ అన్నారు. తన తల్లి స్పూర్తితో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. కెటీఆర్ అంటే తనకు ప్రత్యేక అభిమానం అని సోనూసూద్ తెలిపారు.