Telugu Gateway
Telangana

ఇక ఖమ్మం సీటు పోరు మరింత తీవ్రం !

ఇక ఖమ్మం సీటు పోరు  మరింత తీవ్రం !
X

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అగ్రనేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ని పోటీ చేయాలని కోరింది. ఈ మేరకు పలు మార్లు తీర్మానాలు చేసి మరీ పంపింది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సమయంలో తెలంగాణ సీఎం, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు కూడా ఆమెను ఖమ్మం లోక్ సభ బరిలో నిలవాల్సిందిగా కోరినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె మాత్రం రాజస్థాన్ నుంచి రాజ్యసభ బరిలో నిలుస్తున్నారు. బుధవారం నాడు సోనియా అక్కడ నామినేషన్ కూడా దాఖలు చేయటంతో తెలంగాణాలో సోనియా పోటీ లేదు అని తేలిపోయింది. ఆమె ఇక్కడ పోటీ చేస్తే ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉంది అని పార్టీ నాయకులు లెక్కలు వేసుకున్నారు. కానీ ఇప్పుడు భారం అంతా కూడా రాష్ట్ర నేతలపైనే పడనుంది. అయితే ఇప్పటికే వచ్చిన పలు సర్వే లు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ నే దగ్గర దగ్గర పది సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది అనే అంచనాలను వెలువరించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ మాత్రం పన్నెండు సీట్లు టార్గెట్ గా పెట్టుకుంది అని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. తెలంగాణ లో సోనియా పోటీ లేదు అని తేలిపోవటంతో ఇప్పుడు అందరి దృష్టి ఖమ్మం లోక్ సభ సీట్ పై పడింది. ఎందుకంటే రాష్ట్రంలో ఏ లోక్ సభ సీట్ కోసం లేనంత పోటీ ఖమ్మం లోక్ సభ పైనే ఉన్న విషయం తెలిసిందే.

ఎందుకంటే ప్రస్తుత లెక్కల ప్రకారం ఎవరు పోటీ చేసినా కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ గెలవటం అత్యంత సులభం అనే అంచనాలు ఉండటమే. ఇదే అదనుగా ఇప్పటికే తెలంగాణ మంత్రి వర్గంలో ఉన్న మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఈ సీటు కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త, వివిసి మోటార్స్ అధినేత వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఖమ్మం లోక్ సభ రేస్ లో ఉన్నారు. పొత్తులో భాగంగా తమకు సీటు కేటాయించని పక్షంలో రాజేంద్ర ప్రసాద్ అభ్యర్థిత్వానికి సిపీఐ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ నాయకుల్లోని కుటుంబ సభ్యులను దూరం పెట్టాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే రాజేంద్ర ప్రసాద్ కు అవకాశాలు మెరుగయ్యే ఛాన్స్ ఉంది అని చెపుతున్నారు. మరో వైపు కాంగ్రెస్ సీనియర్లు రేణుక చౌదరి, వి. హనుమంత రావు లు కూడా ఖమ్మం లోక్ సభ సీటు రేస్ లో ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇంత తీవ్రమైన పోటీ ఉన్న సీటు లో ఎవరిని ఎంపిక చేస్తుందో అన్న ఆసక్తి పార్టీ నేతల్లో ఉంది. సోనియా ఖమ్మం రేస్ లో లేరు అని తేలిపోవటంతో ఇక నాయకులు ఈ సీటు దక్కించుకోవటం కోసం కొత్త కొత్త ఎత్తులు వేసే అవకాశం ఉంది అని చెపుతున్నారు.



Next Story
Share it