Telugu Gateway
Telangana

ఎఫ్ ఐ ఆర్ లో పేరులేకుండానే బి ఎల్ సంతోష్ కు సిట్ నోటీసు ఇచ్చిందిగా?!

ఎఫ్ ఐ ఆర్ లో పేరులేకుండానే బి ఎల్  సంతోష్ కు  సిట్ నోటీసు ఇచ్చిందిగా?!
X

కాలయాపన కోసం కవిత లేఖల మార్గాన్ని ఎంచుకున్నారా?

లిక్కర్ స్కాం కు సంబంధించి ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కాలయాపన మార్గాన్ని ఎంచుకున్నారా?. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అదే సందేహం వ్యక్తం అవుతుతోంది తాజాగా కవిత సిబిఐ అధికారులకు మరో లేఖ రాశారు. అందులో ఆమె ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు. తొలుత డిసెంబర్ 6 న తన వివరణ తీసుకోవటానికి రావొచ్చు అని చెప్పిన కవిత, సీఎం కెసిఆర్ తో భేటీ తర్వాత మాట మార్చారు. తనకు తొలుత హోమ్ మంత్రిత్వ శాఖ ఫిర్యాదు కాపీ, ఈ కేసుకు సంబంధించి ఎఫ్ ఐ ఆర్ ఇవ్వాలని అవి చూసిన తర్వాతే విచారణకి సిద్ధంగా ఉంటానని ఫస్ట్ లేఖ రాశారు సిబిఐకి. దీనిపై సిబిఐ మెయిల్ ద్వారా రిప్లై ఇస్తూ వెబ్ సైట్ లోనే అన్ని ఉన్నాయి చూసుకోమని చెప్పారు. దీనిపై స్పందిస్తూ కవిత సోమవారం నాడు మరో లేఖ పంపారు సిబిఐ అధికారికి. అందులో ఆమె ఎఫ్ఐఆర్, నిందితుల జాబితా, ఫిర్యాదును పరిశీలించానని.. కానీ తన పేరు అందులో ఎక్కడా లేదని.. రికార్డెడ్‌గా చెప్పాలనుకుంటున్నట్టు కవిత పేర్కొన్నారు. ఈ నెల 6న సీబీఐని కలవలేనన్నారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల.. సీబీఐ అధికారులను కలిసే అవకాశం లేదన్నారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో సీబీఐకి అందుబాటులో ఉంటానని కవిత పేర్కొన్నారు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. తాను చెప్పిన తేదీల్లో ఎప్పుడైనా సీబీఐ రావొచ్చన్నారు. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని లేఖలో కవిత పేర్కొన్నారు.

ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఏమిటి అంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో బీజేపీ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ పేరు ఎఫ్ ఐ ఆర్ లో లేదు. కానీ సిట్ ఆయనకు 41 ఏ సిఆర్ పీ సి నోటీసు ఇచ్చింది. సిట్ అధికారుల దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం నోటీసు ఇచ్చి ఉండొచ్చు. కానీ ఒక సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత మాత్రం తన పేరు ఎఫ్ ఐ ఆర్ లో లేదని రికార్డు చేస్తున్నట్లు చెప్పటం కీలకంగా మారింది. లిక్కర్ స్కాములో అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఈ డీ చాలా స్పష్టమైన అంశాలతో కవిత పేరును అందులో ప్రస్తావించింది. అధారాలు ఉంటే సిట్ పోలీస్ లు బి ఎల్ సంతోష్ తో పాటు ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చు. కానీ కవిత మాత్రం తన పేరు ఎఫ్ ఐ ఆర్ లో లేదని సిబిఐ అధికారులకు చెప్పటం విచిత్రంగా ఉందని ఒక అధికారి వ్యాఖ్యానించారు. అందుకే వాళ్ళు సిఆర్ పీ సి 160 కింద నోటీసు లు ఇచ్చారని..తమ దగ్గర ఉన్న అధారాలు, కవిత ఇచ్చే సమాధానాలు సరి చూసుకొని తర్వాత ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తారని అయన వెల్లడించారు. మొత్తం మీద టిఆర్ఎస్ ఈ అంశాన్ని ఎంత వీలు అయితే అంత ఇది రాజకీయ కోణంలో నమోదు చేసిన కేసు గా చూపించే ప్రయత్నం చేస్తోంది.

Next Story
Share it