అందుకే నైని టెండర్ రద్దు

సింగరేణి కి చెందిన నైని కోల్ బ్లాక్ వ్యవహారంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం నాడు మరి సారి స్పందించారు. ఆయన తన క్యాంపు ఆఫీస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాలో వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. సింగరేణి గనులపై ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారులు పడకుండా చూడటమే తన లక్ష్యం అన్నారు. ఆంధ్ర జ్యోతి పత్రికలో కొంత మంది ప్రయోజనాల కోసమే ఈ కథనాలు వచ్చినట్లు కనిపిస్తోంది అని .. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో..? తొలిపలుకుల రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో..?.. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థపై నిందలు మోపుతున్నారు అని ఆరోపించారు. సైట్ విజిట్ నిబంధన కొత్తగా సింగరేణి పెట్టింది కాదు అని..కేంద్రంలోని సంస్థలు అన్నీ ఇదే నిబంధనను అనుసరిస్తామని భట్టి విక్రమార్క పలు ఉదాహారణలతో సహా వివరించారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ కోల్ ఇండియా 2018 లోనే ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది అన్నారు. ఇదే కాకుండా పలు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు పలు రాష్ట్రాల్లో కూడా ఈ నిబంధన అమల్లో ఉంది అని తెలిపారు. సింగరేణి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని..టెండర్ నిబంధలనతో పాటు ప్రతి విషయం ప్రభుత్వం వద్దకు రాదు అని తెలిపారు. ప్రజల్లో అపోహలు పెరుగుతాయి అనే ఉద్దేశంతోనే వెంటనే ఈ టెండర్ల రద్దుకు ఆదేశించినట్లు తెలిపారు. సింగరేణిలో మొత్తం 25 టెండర్లు పిలిస్తే..ఇందులో 20 టెండర్లు బిఆర్ఎస్ హయాంలో కేటాయించారు అని భట్టి వెల్లడించారు. ఆంధ్ర జ్యోతి పత్రికలో తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుంటారు అని ఆశిస్తున్నట్లు తెలిపారు.
తాను ఆషామాషీగా రాజకీయాల్లోకి రాలేదు అని...తన 40 సంవత్సరాల ఇమేజ్ ను ఒక్క వార్తతో దెబ్బ తీస్తాను అంటే చూస్తే ఊరుకునే ప్రశ్నే లేదు అన్నారు. ఆంధ్ర జ్యోతి లో నైని కోల్ బ్లాక్ టెండర్ల పై వార్త రావటం..ఈ వెంటనే హరీష్ రావు లేఖ రాయటం...తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిపై స్పందించటం చూస్తుంటే ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారం చేసినట్లు ఉంది అనే అనుమానాలు వస్తున్నాయి అన్నారు. ఎవరికో ఎందుకు తనకు ఒక లేఖ రాస్తే చాలు...2014 నుంచి సింగరేణి లో కేటాయించిన పనులపై విచారణ జరిపించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు విక్రమార్క వెల్లడించారు.



