Telugu Gateway
Telangana

ఇలా కూడా చేయవచ్చా!

ఇలా కూడా చేయవచ్చా!
X

(ఫోటో క్రెడిట్ ఆంధ్ర జ్యోతి)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఆంధ్ర జ్యోతి ఎండీ రాధా కృష్ణకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ గురువారం ఉదయం ఆంధ్ర జ్యోతి పత్రిక చూసిన వాళ్లకు ఆ ఫోటో..వార్త ఒకింత షాక్ లాంటిదే . వార్త చిన్నది అయినా...అది ఎలాంటి సంకేతాలు పంపింది అన్నదే ఇక్కడ అత్యంత కీలకం అని చెప్పాలి. ఆంధ్ర జ్యోతి ఎండీ రాధా కృష్ణ తో సింగరేణి ఎండీ బలరాం భేటీ అని వార్త వేసుకున్నారు. మీడియా అధినేత అన్న తర్వాత అటు రాజకీయ నాయకులతో పాటు అధికారులతో పరిచయం ఉండటం అసాధారణం ఏమి కాదు. ఇందులో పెద్దగా ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా ఏమి లేదు. ఈ వార్తలో సింగరేణి ఎండీ బలరాం మర్యాదపూర్వకంగా కలిశారు అని రాశారు. అంతవరకు బాగానే ఉంది..కానీ సింగరేణి విస్తరణ, సంస్థ అభివృద్ధితో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం తదితర అంశాలపై ఇద్దరూ మాట్లాడుకున్నారు...అభిప్రాయాలను పంచుకున్నారు అని రాసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇరకాట పరిస్థితి అని చెప్పకతప్పదు అని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

సింగరేణి సంస్థ ఎండీ ఒక మీడియా అధినేతతో సంస్థ విస్తరణ, అభివృద్ధి, ఇతర రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్ట్ ల ఏర్పాటు వంటి అంశాలపై ఎలా చర్చిస్తారు అన్నది ఇక్కడ కీలక ప్రశ్నగా మారనుంది. సింగరేణి ఎండీ కలిసిన ఫోటో తో పాటు ఈ వార్తను ప్రచురించటం ద్వారా ఆయన ఎవరికైనా ఏమైనా సంకేతం పమాలనుకున్నారా అన్న చర్చ కూడా తెరమీదకు వచ్చింది. ఈ వ్యవహారం మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కారుకి ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఇది ఇలా ఉంటే రేవంత్ రెడ్డి సర్కారులోని మరో కీలక మంత్రి వారానికి మూడు రోజులు ఒక కీలక ఛానెల్ చైర్మన్ ఇంట్లోనే గడుపుతుండటం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వానికి సంబదించిన విషయాలు అన్ని ఆ కీలక మంత్రి ఆ ఛానెల్ అధినేతకు చేరవేస్తున్నారు అన్న అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it