Telugu Gateway
Telangana

వ‌రి విత్త‌నాలు అమ్మితే అంతే....సుప్రీంకోర్టు..హైకోర్టు చెప్పినా విన‌ను

వ‌రి విత్త‌నాలు అమ్మితే అంతే....సుప్రీంకోర్టు..హైకోర్టు చెప్పినా విన‌ను
X

సిద్ధిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

మండిప‌డుతున్న పార్టీలు

'సిద్ధిపేట జిల్లాలో 350 షాపులు ఉన్నాయి. ఈ రోజు నుంచి షాపుల్లో కిలో వ‌రి విత్త‌నాలు అమ్ముడు అయ్యాయంటే ఆ షాప్ క్లోజ్ చేస్తాం. ఆ షాపు గురించి హైకోర్టు ఆదేశాలు కానీ..ప్ర‌జాప్ర‌తినిధుల రిక్వెస్టులు కానీ..సీనియ‌ర్ అధికారుల రిక్వెస్ట్ లు కానీ ఏమీ కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోబ‌డ‌వు..తీసుకోబ‌డ‌వు అంటూ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు' సిద్ధిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి. తాను క‌లెక్ట‌ర్ గా ఉన్న కాలం ఆ షాప్ మూసివేసే ఉంటుంద‌ని అన్నారు. ఆ షాప్ కాకుండా ఇంకేదో షాపు నుంచి బిజినెస్ చేస్తున్నాడ‌ని తెలిస్తే ఆ షాపు కూడా క్లోజ్ చేయిస్తాన‌న్నారు. వెన్నాడ‌తా..వెంటాడ‌తా. వ‌రి విత్త‌నాలు అమ్మితే మాత్రం ఖబ‌బ్దార్. యాసంగిలో వ‌రికి బ‌దులు ప్ర‌త్యామ్నాయ పంట‌ల సాగు అంశంపై జ‌రిగిన స‌మావేశంలో క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి ఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గామారింది. 'నేను చెప్పిన దానికి విరుద్ధంగా సుప్రీం కోర్టు జడ్జి చెప్పినా, రాష్ట్ర హైకోర్టు జడ్జి చెప్పినా, ప్రజా ప్రతినిధులు చెప్పినా నేను కలెక్టర్‌గా ఉన్నంతకాలం ఎటువంటి పరిస్థితులలో షాపులు తెరుచుకోవు.

ఒకవేళ డీలర్లు విత్తనాలు అమ్మితే సంబంధిత ఏఈవోలు, అధికారులు సస్పెండ్ అవుతారు.' అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. షాపుల వాళ్లు కూడా మ‌న‌కు సోద‌రులే. మ‌న‌కు స‌హ‌క‌రించే వారే కానీ ఇబ్బంది పెట్టే వారు కాదు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై టీపీసీసీ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు. దీనికి ఆయ‌న క‌లెక్ట‌ర్ వ్యాఖ్య‌ల వీడియోను కూడా జ‌త చేశారు. 'వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీడ్ డీలర్లను సిద్దిపేట కలెక్టర్ బెదిరించడం వరి రైతులను బ్లాక్ మెయిల్ చేయడమే. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న ఊరుకోను అంటూ కలెక్టర్ ఒక నియంతలా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వరి రైతుల బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ఈ ఎత్తుగడ.వరి పంటలు వేయనప్పుడు ఇక లక్షల కోట్లు వ్యయం చేసి ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు ఎందుకు' అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై దుమారం రేగంట‌తో క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించార‌ని తెలిపారు.

Next Story
Share it