కెసీఆర్ కాళ్లు మొక్కిన కలెక్టర్
ఓ ఐఏఎస్ ఆఫీసర్ చర్య సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కెసీఆర్ కు ఆయన పాదాభివందనం చేయటమే దీనికి కారణం. సీఎం కెసీఆర్ ఆదివారం నాడు సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. పలు నూతన భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. సిద్దిపేటలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సిద్దిపేట పోలీసు కమిషనరేట్ కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా నూతన భవనంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని సీఎం కెసీఆర్ ఆయన సీటులో కూర్చోపెట్టారు. తర్వాత సీటులో నుంచి లేచిన వెంకట్రామిరెడ్డి సీఎం కెసీఆర్ కాళ్ళకు నమస్కారం చేశారు. కెసీఆర్ వారించే ప్రయత్నం చేసినా కలెక్టర్ మాత్రం పాదాభివందనం చేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.