ఏంటో ఈ కెసిఆర్...కెటిఆర్ ల మెట్రో మాయ !
ముందు ప్రాజెక్ట్ వ్యయం 1250 కోట్లు పెంచి ..ఇప్పుడు 562 కోట్లు తగ్గించారు
తెలంగాణ సర్కారు ఆర్థిక కష్టాల్లో ఉన్నా శంషాబాద్ మెట్రో ప్రాజెక్ట్ పై సీఎం కెసిఆర్ దూకుడు చూపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ తాజాగా టెండర్ లు పిలిచింది. ఆసక్తి ఉన్న సంస్థలు 2023 జులై 5 న బిడ్స్ దాఖలు చేయటానికి తుది గడువుగా నిర్ణయించారు. అంటే ఇది ముగిసిన కొన్నిరోజుల్లోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి ఈ స్పీడ్ చూస్తుంటే తమ హయాంలోనే టెండర్ ఫైనలైజ్ చేసి...కాంట్రాక్టు కేటాయించాలనే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు స్పష్టం అవుతోంది. దీని వల్ల ఎవరి ప్రయోజనాలు వాళ్లకు ఉంటాయి. గత ఏడాది డిసెంబర్ లోనే సీఎం కెసిఆర్ దీనికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయంలో చోటు చేసుకున్న మార్పులు చూసి ఎవరైనా సరే ఏంటో ఈ కెసిఆర్...కెటిఆర్ ల మెట్రో మాయ అని అవాక్కు అవ్వాల్సిందే. తొలుత 31 కిలోమీటర్ ల ఈ మెట్రో ప్రాజెక్ట్ వ్యయం 5000 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. కానీ శంఖుస్థాపనకు కొద్ది రోజుల ముందు తెలంగాణ సర్కారు ఒక్కసారిగా దీన్ని 6250 కోట్ల రూపాయలకు పెంచింది. కిలోమీటర్లు మారలేదు...ఏమీ మారలేదు కానీ...ప్రాజెక్ట్ వ్యయం మాత్రం తొలుత అనుకున్న దానికంటే 1250 కోట్ల రూపాయలు పెరిగింది. సీన్ కట్ చేస్తే తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల లైన్ వేసేందుకు టెండర్లు పిలిచింది. ఇందులో ప్రాజెక్ట్ వ్యయం పన్నులు, సుంకాలు కలుపుకుని 5688 కోట్ల రూపాయలుగా ప్రకటించారు.
అంటే పెంచిన అంచనా వ్యయంలో 562 కోట్ల రూపాయలు తగ్గించి 5688 కోట్ల రూపాయలుగా టెండర్ డాక్యుమెంట్ లో ప్రస్తావించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు తొలుత 6250 కోట్ల రూపాయలుగా నిర్ణయించటం ..ఇప్పుడు ఏకంగా 562 కోట్ల రూపాయలు తగ్గించి దీని టెండర్ విలువ ను 5688 కోట్ల రూపాయలుగా ప్రకటించటంతో తెలంగాణ ప్రభుత్వం రాబోయే రోజుల్లో దీనిపై విచారణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని భయపడి ఎన్నికల ఏడాదిలో రిస్క్ వద్దు అనుకుని ఇలా చేసింది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. గత ఏడాది నవంబర్ 28 న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు మెట్రో బిగ్ స్కాం అంటూ తొలుత వార్త రాసింది తెలుగు గేట్ వే. కామ్ లోనే. అంచనా వ్యయాన్ని 5000 కోట్ల రూపాయల నుంచి 6250 కోట్ల రూపాయలకు పెంచిన విషయాన్నీ వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు తొలుత అనుకున్న దానికంటే 688 కోట్ల రూపాయలుగా ఎక్కువగా...తర్వాత పెంచిన దాంతో చూసుకుంటే 562 కోట్ల రూపాయలు తగ్గించి టెండర్ పిలవటం అంటే ఈ మేర స్కాం కు గండిపడినట్లే అని చెపుతున్నారు. కారణాలు ఏమైనా కూడా పెంచిన ప్రాజెక్ట్ వ్యయం తగ్గించటం అన్నది ఇక్కడ కీలకంగా మారింది. ఈ మేరకు ప్రజలకు మేలు జరిగినట్లే భావించాలి.
టెండర్ విలువ తగ్గటంపై హెచ్ఏఎంఎల్ వివరణ
టెండర్ విలువ (రూ. 5688 కోట్లు) ప్రాజెక్ట్ వ్యయం (రూ. 6250 కోట్లు) కంటే తక్కువగా ఉండటంపై కొంత మంది స్పష్టత అడుగుతున్నారు. ఈ రెండూ భిన్నమైనవి. ప్రభుత్వ (HAML) పరిధిలో ఉన్నందున, అంచనా వేసిన టెండర్ విలువలో GC ఖర్చు, ఆకస్మిక పరిస్థితులు, మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ మొదలైన అంశాలు టెండర్ విలువలో ఉండవు. కానీ మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో అవి ఉన్నాయి. అందుకే ఈ రెండింటికీ తేడా.