సింగపూర్ కు స్కూట్ ఎయిర్ లైన్స్ సర్వీసుల పునరుద్ధరణ
సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన చౌకధరల విమానయాన సంస్థ స్కూట్ ఎయిర్ లైన్స్ భారత్ లోని ఆరు నగరాల నుంచి సింగపూర్ కు విమాన సర్వీసులు ప్రారంభించింది. ఇవి డిసెంబర్ 28 నుంచే ప్రారంభం అయ్యాయి. ఈ నగరాల్లో హైదరాబాద్ తోపాటు విశాఖపట్నం, కోయంబత్తూర్, అమృత్‌సర్, త్రివేండ్రం, తిరుచినాపల్లి ఉన్నాయి. అయితే కోయంబత్తూర్, త్రివేండ్రం, విశాఖపట్నం నుంచి సర్వీసులను కొత్తగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి గతంలో విమాన సర్వీసులు నడిపి మధ్యలోనే నిలిపివేశారు. తాజాగా పలు దేశాల మధ్య కొనసాగుతున్న ఎయిర్ బబుల్ ఒప్పందాల ప్రకారం ఇవి నడుస్తాయి.
విశాఖపట్నం నుంచి ఒక వైపు ప్రయాణ ధర 5500 రూపాయలుగా స్కూట్ ఎయిర్ లైన్స్ పేర్కొంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా దేశంలోకి ప్రవేశించే పర్యాటకులు..ఇతరులు దేశంలో అమల్లో ఉన్న కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఈ విమానాలు వ్యాక్సినేటెడ్ ట్రావెల్ లైన్ (వీటిఎల్) పరిధిలోకి రావన్నారు. దీంతో ప్రయాణికులు ఎంట్రీ రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న దాని ప్రకారం సింగపూర్ వెళ్లే ప్రయాణికులు విధిగా వారం రోజులు హోం క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం తాము ఈ ఆరు మార్గాల్లో ప్రమోషనల్ రేట్లను పెట్టినట్లు ఎయిర్ లైన్స్ తెలిపింది.